నిత్య పెళ్లి కొడుకు.. డాక్టర్, ఇంజినీర్ని అంటూ 15 పెళ్లిళ్లు చేసుకున్నాడు

నిత్య పెళ్లి కొడుకు.. డాక్టర్, ఇంజినీర్ని అంటూ 15 పెళ్లిళ్లు చేసుకున్నాడు

మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్లలో పరిచయమైన మహిళలను ఇంజనీర్‌, డాక్టర్‌ అని నటిస్తూ మోసం చేసిన వ్యక్తిని మైసూరు సిటీ పోలీసులు జూలై 9న అరెస్టు చేశారు. అతను 2014 నుంచి కనీసం 15 మంది మహిళలను వివాహం చేసుకున్నాడని, నలుగురు పిల్లలను కూడా కలిగి ఉన్నాడని అధికారులు అనుమానిస్తున్నారు.

ALSO READ :పవన్ కళ్యాణ్ కు మహిళా కమిషన్ నోటీసులు.. డెడ్ లైన్ ఎప్పటివరకంటే..

నిందితుడిని బెంగళూరులోని బనశంకరి నివాసి మహేష్ కెబి నాయక్ (35)గా గుర్తించారు. మైసూరుకు చెందిన ఈ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. ఈ ఏడాది మొదట్లో పెళ్లి చేసుకున్న మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. వెంటనే అతడిని పట్టుకునేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేసిన పోలీసులు.. తుమకూరులో పట్టుకున్నారు.

నిందితుడు 5వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నప్పటికీ, తాను డాక్టర్, ఇంజనీర్, సివిల్ కాంట్రాక్టర్ అని చెప్పుకునేవాడని పోలీసులు తెలిపారు. అతను వివాహం చేసుకున్న స్త్రీలలో, అతనితో నలుగురు పిల్లలు ఉన్నట్టు సమాచారం. అతడి బాధితురాలిగా మరో మహిళ ఇటీవల ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నాయక్ తుమకూరులో నకిలీ క్లినిక్‌ని ఏర్పాటు చేశాడు. తన వైద్యుడిననే వాదనను బలపరిచేందుకు ఒక నర్సును కూడా నియమించుకున్నాడు. అయినప్పటికీ, అతనికి ఆంగ్లంలో ప్రావీణ్యం లేకపోవడం చాలా మందికి అనుమానాలను రేకెత్తించింది. ఇది అతని వివాహ ప్రతిపాదనను తిరస్కరించడానికి దారితీసింది.

క్లినిక్ నెలకొల్పేందుకు డబ్బుల కోసం నాయక్ తనను వేధించాడని ఫిర్యాదుదారురాలు ఆరోపించింది. ఆమె దానికి నిరాకరించడంతో నగలు, నగదు తీసుకుని పారిపోయాడని బాధితురాలు తెలిపింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, నాయక్ పెళ్లి చేసుకున్న భార్యల్లో చాలా మంది ఆర్థికంగా స్వతంత్ర నిపుణులే. వారు సమాజానికి భయపడి ఫిర్యాదులు చేయకపోవడం అత్యంత విస్మయానికి గురి చేస్తోంది.