పవన్ కళ్యాణ్ కు మహిళా కమిషన్ నోటీసులు.. డెడ్ లైన్ ఎప్పటివరకంటే..

పవన్ కళ్యాణ్ కు మహిళా కమిషన్ నోటీసులు.. డెడ్ లైన్ ఎప్పటివరకంటే..

ఏలూరు సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఏలూరు సభలో వాలంటీర్లపై చేసిన కామెంట్స్‌పై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. జనసేనానికి వ్యతిరేకంగా వాలంటీర్లు నిరసనలు, ధర్నాలు చేపట్టారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో పవన్‌కు నోటీసులు పంపారు. 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వివరణ ఇచ్చే వరకు పవన్‌ను వెంటాడుతూనే ఉంటామన్నారు ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ.

10 రోజుల్లో వివరణ ఇవ్వాలి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏపీ మహిళా కమీషన్ షాకిచ్చింది. ఏపీలో మహిళలు కనిపించకుండా పోతున్నారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకు గానూ నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని..లేదంటే మహిళా కమీషన్ కు క్షమాపణలు చెప్పాలని సూచించింది.  ప్రస్తుతం జనసేనాని  వారాహి యాత్రతో బిజీగా ఉన్నారు. ఈ యాత్రలో భాగంగా ఏలూరులో నిర్వహించిన బహిరంగ సభలో వాలంటీర్ వ్యవస్థపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇంతలా మానవ అక్రమ రవాణా జరగడానికి కారణం వాలంటీర్ వ్యవస్థ అన్న పవన్ ..సేకరిస్తున్న సమాచారం కొన్ని అసాంఘిక వర్గాలకు చేరుతుందని నిఘా వర్గాలు చెబుతున్నాయన్నారు. ఏ కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉన్నారు. వారిలో ఎంతమంది ఒంటరి మహిళలు ఉన్నారనే సమాచారాన్ని అసాంఘిక, సంఘ విద్రోహ శక్తులకు చేరడం వల్ల మానవ అక్రమ రవాణా పెరిపోయిందని పవన్   ఆరోపించారు.

రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు  వ్యతిరేకంగా  రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు  నిరసనలు చేపట్టారు. కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు, ఆందోళను నిర్వహించారు. . పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తమను  బాధించాయని.. మహిళలమే ఎక్కువమంది వాలంటీర్లుగా పనిచేస్తున్నామంటున్నారు. పవన్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్‌ను కోరామని.. ప్రజల వద్దకు వెళ్లి సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన వివరాలు మాత్రమే తీసుకుంటామన్నారు. లబ్ధిదారుల వ్యక్తిగత వివరాలు తీసుకోమని.. ప్రభుత్వ నిబంధనల మేరకే పనిచేస్తామని... మహిళా వాలంటీర్లు అందరికీ పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలన్నారు.

ALSO READ :నల్ల చీరలు ధరించి.. అంగన్వాడీల వినూత్న నిరసన

యువత చెడిపోవడానిక పవన్ సినిమాలే కారణం

పవన్ కళ్యాణ్ ఒంటరి మహిళల్ని అవమానపరిచేలా మాట్లాడారని.. ఆయన వివరణ ఇచ్చే వరకు మహిళా కమిషన్ వెంటాడుతుందన్నారు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ. వాలంటీర్లకు పవన్ క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలన్నారు.  యువత చెడిపోవడానికి పవన్ కళ్యాణ్ సినిమాలే కారణమన్నారు. కేంద్ర ఇంటిలిజెన్స్ విడుదల చేసిందని చెబుతున్న నివేదికను బయటపెట్టాలని ఏపీ మహిళా కమిషన్ డిమాండ్ చేసింది.  వాలంటీర్స్‌పై పవన్ కళ్యాణ్ విషం కక్కుతున్నారని మండిపడ్డారు వాసిరెడ్డి పద్మ .  ఈ మెయిల్స్ ద్వారా పవన్ పై మహిళా సంఘాలు, వాలంటీర్లు ఫిర్యాదులు చేస్తున్నారని..  పవన్ కు ఏ ఇంటిలిజెన్స్ అధికారి చెప్పారో సమాధానం చెప్పాలని నిలదీశారు.. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి తప్పించుకోలేరన్నారు. వాలంటీర్లకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 1400 మిస్సింగ్ కేసులు మాత్రమే ఉన్నాయని.. పవన్ కళ్యాణ్ చెప్తున్న 30వేల మిస్సింగ్ కేసులకు లెక్క చెప్పాలన్నారు. 

మహిళా కమిషన్ నోటీసులు

ఏపీలో మహిళలు కన్పించకుండా పోయారని..వైసీపీ అధికారం చేపట్టిన నాలుగేళ్ల పాలనలో దాదాపు 29 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారని పవన్  సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న మహిళా కమీషన్ పవన్ కు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. మహిళలను అడ్డం పెట్టుకొని మాట్లాడితే మహిళా కమీషన్ రియాక్ట్ అవుతుందని.. మహిళలకు కమీషన్ అండగా ఉంటుందన్నారు. మరి మహిళా కమీషన్ నోటిసులపై పవన్ కళ్యాణ్   ఎలాంటి వివరణ ఇస్తారనేది చూడాలి.  పవన్ కళ్యాణ్ కు మహిళా కమీషన్ నోటీసులు ఇవ్వడం ఇది మొదటిసారి కాదు. గతంలో 3 పెళ్లిళ్లకు సంబంధించి పవన్ చేసిన వ్యాఖ్యలపై కూడా కమీషన్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

చంద్రబాబు చెప్పిన మాటలేనా...

వాలంటరీ వ్యవస్థ పై పవన్ మాటలు హేయమన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ప్రజలకు మేలు చేసే వ్యవస్థ వాలంటరీ వ్యవస్థపై వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్‌కి అసలు లోక జ్ఞానం లేదన్నారు. మహిళలను హేళన చేస్తున్న పవన్‌కు సిగ్గు శరం లేదని మండిపడ్డారు. అవ్వ తాతలకు సేవ చేసే వ్యక్తులు వాలంటీర్లపై నోటికొచ్చినట్లు మాట్లాడటం దారుణమన్నారు. చంద్రబాబు చెప్పిన మాటలు మాట్లాడే వ్యక్తి పవన్.. ఈ వ్యాఖ్యలకు బీజేపీ సమాధానం చెప్పాలన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు.