హైదరాబాద్: నల్లమల సాగర్ ప్రాజెక్ట్‌పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం (ఫిబ్రవరి 26) అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు మేం అభ్యంతరం చెప్పలేదని.. ఇప్పుడు అదే గోదావరి నదిపై ఏపీ ప్రభుత్వం చేపడుతోన్న నల్లమల సాగర్ ప్రాజెక్ట్‌కు తెలంగాణ వాళ్లు కూడా అడ్డుపడొద్దని కోరారు.
నల్లమలసాగర్‌తో తెలుగు రాష్ట్రాలకు లాభమే తప్ప ఎలాంటి నష్టం లేదని పేర్కొన్నారు. గోదావరి నది నుంచి వృధాగా సముద్రంలోకి వెళ్లే నీటినే మేం ఉపయోగించుకుంటామని చెప్పారు. నీళ్లు ఉంటే అన్ని సమస్యలు పరిష్కారం- అవుతాయన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని నదులు అనుసంధానంపై ముందుకెళ్తామని స్పష్టం చేశారు.
నా హయాంలో రెండోసారి గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయని.. పుష్కరాల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్ట్ కు నేనే శంకుస్థాపన చేశా.. నేనే పూర్తి చేయబోతున్నానని చెప్పారు. 2026, జూలైలో వెలిగొండ ఫేజ్ 1 నుంచి నీళ్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. 14 వారాలు వెలిగొండకు డెడ్ లైన్ పెట్టామని.. వెలిగొండ ప్రాజెక్ట్ ప్రతీ రిపోర్ట్ స్వయంగా పరిశీలిస్తానని తెలిపారు.
గత పాలకులు రూ.2 వేల 500 కోట్ల పనులు పెండింగ్ పెట్టి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తికాక ముందే జాతికి అంకితం అంటూ హడావుడి చేశారని విమర్శించారు. పట్టిసీమతో నీళ్లు తెచ్చి కృష్ణా డెల్టాకు అందించామని తెలిపారు. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్లు అందించి రాయలసీమను రతనాల సీమ చేశామన్నారు. ఉత్తరాంధ్రలో 11 ప్రాజెక్టులు ఈ టర్మ్‌లో పూర్తి చేస్తామన్నారు.
