మలయాళ యాంక్ర్ గా, నటిగా గుర్తింపు తెచ్చుకున్న పెర్లీ మానీ మరో సారి హాట్ టాపిక్ గా మారారు. ఇటీవల NEET పేవర్ లీక్ పై విద్యార్థులు నిరసనలు చేపట్టారు. అయితే ఈ నిరసనల నేపథ్యంలో ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ పెద్ద ఎత్తున వివాదానికి దారి తీసింది. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె కేవలం రెండు రోజుల్లోనే మూడు లక్షలకు పైగా ఫాలోవర్లను కోల్పోవాల్సి వచ్చింది. ఇది ఇప్పుడు మలయాళ సినీ, టెలివిజన్ రంగంలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఈ అంశం పెద్ద చర్చకు దారితీసింది.
ఆ పోస్ట్ లో ఏముందంటే?
పెర్లీ మానీ సోషల్ మీడియాలో విద్యార్థుల నిరసనను ఉద్దేశిస్తూ.. ఏ లక్ష్యం కూడా ఒకరి ప్రాణాల కంటే గొప్పది కాదు.. మీ భద్రతకు ముప్పు ఉందని భావిస్తే నిరసనలు విరమించి ఇళ్లకు వెళ్లండి అంటూ పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్టుకు కామెంట్స్ ను డిసేబుల్ చేయడం.. పోస్ట్ డిజైన్ కు ఉపయోగించిన రంగులు , క్యాప్షన్ వంటి అంశాలపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమెపై విమర్శలు వెల్లు వెత్తాయి. భారీ స్థాయిలో అన్‌ఫాలో క్యాంపెయిన్ జరిగినట్లు చర్చ నడుస్తోంది.
ఒకవైపు పలువురు నెటిజన్లు పెర్లీ వ్యవహారాన్ని తప్పుబడుతూ విమర్శలు గుప్పిస్తుంటే, మరోవైపు ఆమె అభిమానులు మాత్రం పూర్తి వివరాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం సరైంది కాదంటూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ వివాదం ఎంత పెద్దదైనా, ఇప్పటివరకు పెర్లీ మానీ మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
చరణ్ పేరును గుర్తు పెట్టుకోలేక...
ఇక తెలుగు ప్రేక్షకులకు కూడా పెర్లీ మానీ బాగా సుపరిచితమే. 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రమోషన్స్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళితో ఆమె నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఆ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ పేరును గుర్తు పెట్టుకోలేక ఇబ్బంది పడిన వీడియో అప్పట్లో ట్రెండింగ్‌గా మారింది. ఆ ఘటన తర్వాత తెలుగు ప్రేక్షకుల్లో కూడా పెర్లీకి మంచి గుర్తింపు వచ్చింది.
ప్రస్తుతం ఆమెపై జరుగుతున్న ఈ సోషల్ మీడియా వివాదం మరోసారి ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. డిజిటల్ యుగంలో సెలబ్రిటీల ప్రతి పోస్ట్, ప్రతి వ్యాఖ్య క్షణాల్లో వైరల్ అవుతుండగా, ప్రజాభిప్రాయం కూడా అంతే వేగంగా మారిపోతోంది. అయితే నిజంగా పెర్లీ మూడు లక్షలకుపైగా ఫాలోవర్లను కోల్పోయిందా? ఈ వివాదంపై ఆమె స్పందిస్తుందా? అనే అంశాలపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.
