టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి అమ్మాజీ (96) కన్నుమూశారు. ఈ వార్తతో పూరి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషాదాన్ని పూరి కుమార్తె పవిత్ర సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా నానమ్మతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ కు గురైంది..
ఇన్‌స్టాగ్రామ్‌లో నానమ్మతో ఉన్న ఓ మధురమైన ఫొటోను షేర్ చేసిన పవిత్ర.. అందరి హృదయాన్ని తాకే సందేశాన్ని రాసింది. "ఇక నన్నెవరు 'చిన్నతల్లి' అని పిలుస్తారు? ప్రేమగా నన్నెవరు ముద్దుపెడతారు? నీతో మరో రోజు గడిపే అవకాశం ఉంటే ఎంత బాగుండేది. నీ 96వ పుట్టినరోజున ఇచ్చినట్లే మరోసారి నిన్ను గట్టిగా హత్తుకునేదాన్ని. ఐ మిస్ యూ గ్రాండ్‌మా" అంటూ తన బాధను వ్యక్తం చేసింది. ఈ పోస్టు చూసిన నెటిజన్లు, సినీ ప్రముఖులు పవిత్రకు, పూరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
ఇప్పటివరకు పూరి జగన్నాథ్ తన తల్లి మరణంపై ప్రత్యేకంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగే ఆమె మరణానికి సంబంధించిన ఇతర వివరాలను కూడా కుటుంబ సభ్యులు వెల్లడించలేదు. ఈ క్లిష్ట సమయంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పూరి కుటుంబానికి ధైర్యం చెబుతూ, అమ్మాజీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
ఇక పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఆయన తమిళ స్టార్ విజయ్ సేతుపతితో 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో టబు, విజయ్ కుమార్, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. యాక్షన్, భావోద్వేగాలు, సామాజిక అంశాల మేళవింపుతో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
