V6 News

బెంగళూరులో ఐపీఎల్ టిక్కెట్ల దందా.. క్యాంటీన్ వర్కర్ అరెస్ట్!

బెంగళూరులో ఐపీఎల్ టిక్కెట్ల దందా.. క్యాంటీన్ వర్కర్ అరెస్ట్!

IPL Tickets Illegally: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫీవర్ నగరాన్ని ఊపేస్తుంటే, ఇదే అదనుగా కొందరు అక్రమార్కులు టిక్కెట్లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో పని చేసే ఒక క్యాంటీన్ వర్కర్ ఐపీఎల్ టిక్కెట్లను భారీ ధరకు అమ్ముతూ పోలీసులకు పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఉదంతం వెనుక కార్పొరేట్ సంస్థలు, స్టేడియం లోపలి వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఒక్క టిక్కెట్ రూ. 19 వేలకు విక్రయం: 
సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నస్వామి స్టేడియం లోపల ఉన్న 'శ్రీ లక్ష్మీ క్యాంటీన్'లో పని చేసే చంద్రశేఖర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 15వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరిగిన హై-డిమాండ్ మ్యాచ్ టిక్కెట్లను ఇతను బ్లాక్‌లో విక్రయిస్తున్నాడు. ఒక్కో టిక్కెట్టును రూ. 15,000 నుంచి రూ. 19,000 వరకు అమ్ముతుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

కంపెనీల పేర్లతో బల్క్ లో టిక్కెట్స్ కొనుగోళ్లు: 
పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. టిక్కెట్లను కేవలం వ్యక్తులు మాత్రమే కాకుండా, కొన్ని ప్రైవేట్ కంపెనీలు బల్క్ (మొత్తంగా) కొనుగోలు చేసి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు తేలింది. టికెట్ జెనీ (Ticketgenie) ప్లాట్‌ఫారమ్ ద్వారా 'స్వస్తిక హెవీ ఇంజనీరింగ్', 'ఇండస్ట్రియల్ ఆటోమేషన్ కన్సల్టెంట్', 'ధరణి కంప్యూటర్స్' లాంటి కంపెనీల పేర్లతో టిక్కెట్లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కేవలం ఏప్రిల్ 15 మ్యాచ్ మాత్రమే కాకుండా, మార్చి 28వ తేదీన జరిగిన RCB vs CSK మ్యాచ్‌లో కూడా రూ. 6.60 లక్షల విలువైన 81 టిక్కెట్లను ఇదే తరహాలో విక్రయించినట్లు తేలింది. మొత్తం మీద రూ. 17.52 లక్షల విలువైన 181 టిక్కెట్లను అక్రమంగా విక్రయించినట్లు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిర్ధారించారు. 

►ALSO READ | GT vs KKR మ్యాచ్కి ముందు కీలక పరిణామం.. రహానే ఔట్, రింకుకి కెప్టెన్సీ పగ్గాలు

అసలు సూత్రధారి KSCA సభ్యుడేనా?: 
అరెస్టైన చంద్రశేఖర్‌ను విచారించగా, ఈ దందా వెనుక KSCA సభ్యుడు గణేష్ పరీక్షిత్ ఉన్నట్లు ఒప్పుకున్నాడు. పరీక్షిత్ స్వయంగా టిక్కెట్లు సరఫరా చేసి, వాటిని అధిక ధరకు అమ్మాలని సూచించినట్లు నిందితుడు పేర్కొన్నాడు. ప్రస్తుతం గణేష్ పరీక్షిత్ పరారీలో ఉండటంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. అయితే, సామాన్య క్రికెట్ అభిమానులకు టిక్కెట్లు దొరకడం గగనమవుతున్న తరుణంలో, ఇలాంటి అక్రమ దందాలు బయటపడటం తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.