GT vs KKR: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈరోజు ( 2026, ఏప్రిల్ 17న) మరో ఉత్కంఠభరిత పోరుకు రంగం సిద్ధమైంది. ఐపీఎల్ 2026లో భాగంగా ఇప్పటి వరకు ఒక్క విజయం కూడా నమోదు చేయని కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వర్సెస్ ఫుల్ ఫామ్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్ (GT) తో తలపడనుంది. అయితే ప్రస్తుతం అందరి దృష్టి పాయింట్ల పట్టిక కంటే కూడా కేకేఆర్ జట్టులో జరగబోయే పెను మార్పులపైనే నెలకొంది. వరుస ఓటములతో సతమతమవుతున్న కేకేఆర్ మేనేజ్‌మెంట్, జట్టు పగ్గాలను స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ చేతికి అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు రూ. 18 కోట్ల స్టార్ పేసర్ మతీషా పతిరానా గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు కూడా దూరం కావడం కేకేఆర్ ఆందోళనను మరింత పెంచుతోంది.
కెప్టెన్‌గా రింకూ సింగ్?:
కేకేఆర్ సీజన్‌ను మలుపు తిప్పే దిశగా మేనేజ్‌మెంట్ ఒక సాహసోపేత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుత కెప్టెన్ అజింక్యా రహానే అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు కెప్టెన్సీలోనూ విఫలమవుతుండటంతో, అతని స్థానంలో రింకూ సింగ్‌కి సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. జట్టులో లోపించిన "ఇంటెంట్" (కసి)ని రింకూ తీసుకురాగలడని మేనేజ్‌మెంట్ నమ్ముతోంది. ఒకవేళ రింకూ కెప్టెన్ అయితే, రహానేను తుది జట్టు నుంచి తప్పించి, అతని స్థానంలో మరింత వేగంగా ఆడే టాప్ ఆర్డర్ బ్యాటర్‌ను తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక గత కొంతకాలంగా కేకేఆర్ కోసం అద్భుత ప్రదర్శన చేస్తున్న రింకూకు పెద్ద బాధ్యత ఇవ్వాలని అభిమానులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు.
►ALSO READ | సౌతాఫ్రికాతో ఇండియా అమ్మాయిల ఢీ... ఇవాళ ( ఏప్రిల్ 17 ) తొలి టీ20 మ్యాచ్
కేకేఆర్‌కు తప్పని నిరాశ
శ్రీలంక సంచలనం, 'స్లింగా' పతిరానా రాక కోసం కేకేఆర్ ఫ్రాంచైజీ ఇంకా ఎదురుచూస్తేనే ఉంది. టీ20 ప్రపంచకప్‌లో గాయ పడి ఇంకా అతను కోలుకోలేదు. లంక క్రికెట్ బోర్డు నుంచి అనుమతి లభించినప్పటికీ, ఫిట్‌నెస్ సమస్యల వల్ల మెడికల్ టీమ్ అతడిని ఆడించేందుకు మొగ్గు చూపడం లేదు. పతిరానా లేకపోవడంతో వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి లాంటి యువ బౌలర్లే గిల్, బట్లర్ వంటి దిగ్గజాలను అడ్డుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
తుది జట్ల అంచనా
కోల్‌కతా నైట్ రైడర్స్: సునీల్ నరైన్, టిమ్ సీఫెర్ట్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, రింకూ సింగ్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, రమణ్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి.
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, కగిసో రబాడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

