IPL 2024: ఐపీఎల్ మ్యాచ్‌లకు నీటి కష్టాలు.. BWSSB కీలక నిర్ణయం

IPL 2024: ఐపీఎల్ మ్యాచ్‌లకు నీటి కష్టాలు.. BWSSB కీలక నిర్ణయం

బెంగళూరు లోని ఐపీఎల్ మ్యాచ్ లకు సూపర్ క్రేజ్ ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున విరాట్ కోహ్లీ ఆడటమే దీనికి కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇక్కడ జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ లకు అభిమానులతో స్టేడియం మొత్తం నిండిపోవడం గ్యారంటీ. అయితే ఐపీఎల్ 17వ సీజన్ కోసం బెంగళూరులో మ్యాచ్ లకు నీటి కష్టాలు తప్పేలా లేవు.   

బెంగళూరు వేదికగా నిర్వహించే ఒక్కో మ్యాచ్ కు  75,000 లీటర్ల నీటి అవసరం ఉంటుంది. ఇక్కడ ప్రజలు అసలే నీటి కష్టాల్లో ఉంటే ఐపీఎల్ మ్యాచ్ లకు ఎలా నీరు సరఫరా చేస్తారనే విషయం పెద్ద తలనొప్పిగా మారింది. ఈ మేరకు కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డ్‌ విన్నపంపై ది బెంగళూరు వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజ్‌ బోర్డ్‌ (బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ) కీలక నిర్ణయం తీసుకొంది.బెంగళూరులో కొనసాగుతున్న తాగునీటి సమస్య దృష్ట్యా, రాబోయే IPL 2024 క్రికెట్ మ్యాచ్‌ల కోసం నగరంలోని M చిన్నస్వామి స్టేడియంకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు.

ఈ నీటిని కబ్బన్‌ పార్క్‌ వేస్ట్‌ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నుంచి తీసుకోనున్నారు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) మేనేజ్‌మెంట్ బోర్డు అభ్యర్థన మేరకు బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఈ స్టేడియంలో మార్చి 25, 29 మరియు ఏప్రిల్ 2 తేదీల్లో మూడు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టోర్నీలో తమ తొలి మ్యాచ్ ను మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతుంది. సొంత గడ్డపై తమ తొలి మ్యాచ్ ను పంజాబ్ కింగ్స్ తో ఆడుతుంది.