వరకట్న వేధింపులతో అత్తమామలపై ఫిర్యాదు చేసిన రెజ్లర్

వరకట్న వేధింపులతో అత్తమామలపై ఫిర్యాదు చేసిన రెజ్లర్

బేటీ బచావో బేటీ పఢావో బ్రాండ్ అంబాసిడర్, గ్వాలియర్‌కు చెందిన అంతర్జాతీయ మహిళా రెజ్లర్ రాణి రాణా అత్తమామలపై కేసు ఫైల్ చేసింది. వారు తనను వరకట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. వరకట్న చట్టం కింద తీవ్ర ఆరోపణలు చేసిన రాణా.. అత్తమామలు తనను కుస్తీ పోటీల్లో పాల్గొనకుండా అడ్డుకుంటున్నారని, ఇది తన విజయానికి అడ్డంకిగా మారుతోందని అన్నారు. రాణా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అంతర్జాతీయ మహిళా రెజ్లర్ రాణి రాణా తన అత్తమామలపై ఫిర్యాదు చేసిందని ఈ సందర్భంగా గ్వాలియర్ ఏఎస్పీ రిషికేష్ మీనా తెలిపారు. తన అత్తమామలు తనను కుస్తీ ఆడకుండా అడ్డుకోవడమే కాకుండా ఏ పోటీలోనూ పాల్గొనకుండా అడ్డుకుంటున్నారని ఆమె ఫిర్యాదులో తెలిపినట్టు మీనా చెప్పారు. ఆదర్శానికి ప్రతిరూపమైన రాణా... వరకట్న వేధింపులు, శారీరక, మానసిక వేధింపుల ఆరోపణలు చేసిందని, అందుకే తన అత్తమామలపై అధికారికంగా ఫిర్యాదు చేసిందని సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (CSP) వినాయక్ శుక్లా తెలిపారు. ఇప్పటికే తాము చట్టపరమైన చర్యలను ప్రారంభించామన్నారు.

రెజ్లింగ్ ను కెరీర్ గా మలచుకున్న రాణా.. గొప్ప పోరాట పటిమను ప్రదర్శించింది. ఆమె కేవలం తన కుటుంబానికే కాకుండా గ్వాలియర్, దేశం మొత్తానికి కూడా ప్రశంసలు తెచ్చిపెట్టింది. తన కెరీర్‌లో, రాణా దేశానికి బంగారు పతకాన్ని తీసుకువచ్చింది. ఆమె అండర్-23.. 55 కిలోల విభాగంలో గెలిచిన రాణా.. గ్వాలియర్‌లోనే మొదటి మహిళా రెజ్లర్‌గా నిలిచింది. దీంతో పాటు పలు పోటీల్లోనూ పాల్గొని దేశానికి రజత, కాంస్య పతకాలు సాధించింది. గతేడాది కొన్ని భూవివాదాల కారణంగా రాణా తన సోదరుడిపై, తన సొంత కుటుంబ సభ్యులపై కాల్పులు జరిపినప్పుడు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది.