తెలుగు చిత్రపరిశ్రమలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే అభిమానులకు పూనకాలే. అయితే, ఇదే అభిమానాన్ని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు అక్రమ వసూళ్లకు తెరలేపారు. ఎన్టీఆర్ పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నామంటూ సోషల్ మీడియాలో విరాళాలు సేకరిస్తున్న ఘటనలపై తారక్ టీమ్ లేటెస్ట్ గా ఒక సెన్సేషనల్ స్టేట్‌మెంట్ విడుదల చేసింది.
అసలేం జరుగుతోంది?
గత కొంతకాలంగా వాట్సాప్ గ్రూపులు, ఎక్స్ , ఫేస్‌బుక్ వేదికగా ఎన్టీఆర్ ఛారిటీ, తారక్ ఫ్యాన్స్ సేవా సమితి వంటి పేర్లతో కొందరు వ్యక్తులు డబ్బులు వసూలు చేస్తున్నారు. పేదలకు సాయం, అన్నదానం పేరుతో సామాన్య ప్రజల నుంచి, అమాయక అభిమానుల నుంచి భారీగా విరాళాలు లాగుతున్నారు. ఈ విషయం ఎన్టీఆర్ టీమ్ దృష్టికి వెళ్లడంతో వారు వెంటనే రంగంలోకి దిగారు.
టీమ్ నుంచి క్లారిటీ..
కొన్ని ఫ్యాన్ గ్రూపులు ఎన్టీఆర్ పేరు వాడుతూ విరాళాలు సేకరిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ తరహా కార్యకలాపాలతో ఎన్టీఆర్ గారికి కానీ, ఆయన అధికారిక కార్యాలయానికి కానీ ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి వాటిని ఆయన ఏమాత్రం ప్రోత్సహించరు అని టీమ్ స్పష్టం చేసింది. ఎన్టీఆర్ తరఫున ఏదైనా సేవా కార్యక్రమం జరిగితే అది ఆయన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారానే వస్తుందని స్పష్టం చేసింది.
ఫ్యాన్స్ అలర్ట్..
ఎవరైనా తారక్ ఫోటోలు చూపిస్తూ చందాలు అడిగితే గుడ్డిగా నమ్మోద్దని ఎన్టీఆర్ టీమ్ పేర్కొంది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆయన పేరును దుర్వినియోగం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇలాంటి అనుమానాస్పద లింకులు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా ఎన్టీఆర్ టీమ్‌కు సమాచారం అందించాలని కోరింది.
ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస గ్లోబల్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఒకవైపు ఆయన రేంజ్ పెరుగుతుంటే, మరోవైపు ఇలాంటి మోసగాళ్లు పెరగడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా అన్న పేరు వాడితే ఊరుకోం అంటూ సోషల్ మీడియాలో హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఫ్యాన్స్.. బీ కేర్‌ఫుల్.. మీ అభిమానం మోసగాళ్లకు పెట్టుబడిగా మారకుండా చూసుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు.
Important Notice To All @tarak9999 Fans ! pic.twitter.com/UYgDWRFNun
— NTR Trends (@NTRFanTrends) May 13, 2026
