భద్రాచలం: సీసీ కెమెరాల పర్యవేక్షణలో.. రామాలయం అభివృద్ధి పనులు

భద్రాచలం: సీసీ కెమెరాల పర్యవేక్షణలో.. రామాలయం అభివృద్ధి పనులు
  •     స్పెషల్ ఆఫీసర్​గా ఆర్అండ్​బీ రిటైర్డ్ ఎస్ఈ వెంకటేశ్వరరావు నియామకం
  •     ఎండోమెంట్ డైరక్టర్​ హన్మంతరావు వెల్లడి

భద్రాచలం, వెలుగు: సీసీ కెమెరాల ద్వారా హైదరాబాద్​ నుంచే ప్రతీ రోజు భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనులు పర్యవేక్షిస్తామని ఎండోమెంట్​ డైరక్టర్  హన్మంతరావు తెలిపారు. పనుల పర్యవేక్షణకు ఆర్అండ్​బీ రిటైర్డ్  ఎస్ఈ వెంకటేశ్వరరావును స్పెషల్  ఆఫీసర్​గా నియమించినట్లు ప్రకటించారు. భద్రాచలంలో జరుగుతున్న దేవస్థానం అభివృద్ధి పనులను గురువారం పరిశీలించారు. ముందుగా ఆలయంలో పూజలు నిర్వహించగా, ఈవో దామోదర్​రావు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. 

అనంతరం ఉత్తరద్వారం, పడమర మెట్లు, దక్షిణం దిక్కున జరుగుతున్న పనులను పరిశీలించారు. పనులు స్లోగా జరుగుతున్నాయని, జీరో ప్రోగ్రెస్​ అంటూ అసహనం వ్యక్తం చేశారు. 24 గంటలు పని చేస్తేనే గడువులోగా పనులు పూర్తవుతాయని, భారీ యంత్రాలను సమకూర్చాలని కాంట్రాక్టర్​ను ఆదేశించారు. డిసెంబరు 20న ముక్కోటి ఏకాదశి నాటికి ఉత్తరద్వారం అప్పగించాలంటే, నవంబర్​ నెలాఖరునే​డెడ్​లైన్​గా పెట్టుకోవాలన్నారు. 

వారానికోసారి ఈవో దామోదర్​రావు, 15 రోజులకోసారి తాను, నెల రోజులకోసారి ఎండోమెంట్​ మినిస్టర్​ పనుల పురోగతిపై రివ్యూ చేస్తామని తెలిపారు. సీసీ కెమెరాలను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భద్రాచలంలోనే ఉండి పనులు పర్యవేక్షించడంతో పాటు కాంట్రాక్టర్, ఆఫీసర్లు, ఆర్కిటెక్​లను సమన్వయం చేసేందుకు స్పెషల్​ ఆఫీసర్​ను నియమించినట్లు తెలిపారు. మిగిలిన ఆలయాలతో పోల్చితే భద్రాచలం రామాలయం భిన్నమైందని, ఉత్సవాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. వాటిని దృష్టిలో పెట్టుకుని పనులపై ఫోకస్​ పెట్టాలని ఆదేశించారు. అనంతరం ఈవో, ఆర్అండ్​బీ ఇంజనీర్లు, ఆర్కిటెక్​లతో సమావేశం నిర్వహించారు. ఆర్అండ్​బీ సీఈ వెంకటేశ్వర్లు, ఎండోమెంట్​ ఈఈ రవీందర్​రాజు, స్థానాచార్యులు స్థలసాయి పాల్గొన్నారు.