భద్రాచలం,వెలుగు: భద్రాచలం సీతారామచంద్రస్వామి శుక్రవారం భక్తులకు స్వర్ణ కవచాల్లో దర్శనమిచ్చారు. సుప్రభాత సేవ అనంతరం గర్భగుడిలోని ధృవమూర్తులను స్వర్ణ కవచాలతో అలంకరించి, విశేష హారతులు సమర్పించారు. లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసి, లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన, కుంకుమార్చన నిర్వహించారు. విష్ణుసహస్ర నామాపారాయణం చేశారు. సీతారామచంద్రస్వామి కల్యాణమూర్తులకు బేడా మండపంలో నిత్య కల్యాణం జరిగింది.
సాయంత్రం దర్బారు సేవ, సంధ్యాహారతిని సమర్పించారు. కాగా, శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈనెల 27న కల్యాణం, 28న శ్రీరామపట్టాభిషేకం ఉత్సవాలకు లక్షల మంది భక్తులు వస్తారు. ఈ నేపథ్యంలో భద్రాద్రిని ముస్తాబు చేస్తున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో స్వాగతద్వారాలు సిద్ధం చేస్తున్నారు. గోదావరి కరకట్టపై ఉన్న రామాయణంలోని ఘట్టాలను తెలిపే శిల్పాలకు రంగులు వేస్తున్నారు.
