భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల పనులు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. రూ.1.50 కోట్లతో దేవస్థానం భక్తులకు వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ముందుగా ఆలయ గోపురాలకు, మార్చి 27న సీతారాముల కల్యాణం జరిగే మిథిలాస్టేడియం ప్రాంగణంలోని కల్యాణ మండపం, ఆర్చీలకు రంగులు వేసే పనులు ప్రారంభమయ్యాయి.
సుమారు లక్ష మంది భక్తులు కల్యాణాన్ని భద్రాచలంలో ప్రత్యక్షంగా, ఎల్ఈడీల్లో పరోక్షంగా వీక్షించనున్నారు. టిక్కెట్లు కొనుగోలు చేసి కల్యాణం తిలకించేందుకు వచ్చే భక్తులకు సెక్టార్లు నిర్మిస్తున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ సెక్టారులో తాగునీటి వసతి కల్పిస్తున్నారు. భక్తులకు ప్రసాదాలు, స్వామి వారి కల్యాణ తలంబ్రాలు అందించేలా ఈవో దామోదర్‌రావు సూచనల మేరకు కౌంటర్లు నిర్మిస్తున్నారు. తాత్కాలిక వసతి, శానిటేషన్‌పై దృష్టి సారించారు.
వైభవంగా కల్యాణం..
సీతారామచంద్రస్వామి నిత్య కల్యాణం బేడా మండపంలో వైభవంగా జరిగింది. సుప్రభాత సేవ అనంతరం కల్యాణమూర్తులను మండపానికి తీసుకెళ్లి భక్తుల సమక్షంలో క్రతువు నిర్వహించారు. బదిలీపై వెళ్తున్న కలెక్టర్ జితేశ్ వి పాటిల్సీతారామచంద్రస్వామిని దర్శించకున్నారు. ఈవో దామోదర్ ఆధ్వర్యంలో అర్చకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం లక్ష్మీతాయారు అమ్మవారి సన్నిధిలో ఆయనకు వేదాశీర్వచనం ఇచ్చారు.
