రామయ్య పెండ్లి పనులు షురూ...తలంబ్రాలు కలిపే పని మొదలుపెట్టిన అర్చకులు, అధికారులు

రామయ్య పెండ్లి పనులు షురూ...తలంబ్రాలు కలిపే పని మొదలుపెట్టిన అర్చకులు, అధికారులు
  • స్వామివారికి సంప్రదాయబద్ధంగా డోలోత్సవం, వసంతోత్సవం

భద్రాచలం, వెలుగు : భద్రాచల సీతారాముల పెండ్లి పనులు బుధవారం ప్రారంభం అయ్యాయి. ఈ నెల 27న నిర్వహించనున్న స్వామి వారి కల్యాణానికి అవసరమైన తలంబ్రాల తయారీ ప్రక్రియను మొదలు పెట్టారు. ముందుగా ఆలయ ఉత్తరద్వారం వద్ద రుత్విక్కుల సతీమణులు రోటిలో పసుపు కొమ్ములను దంచారు. అనంతరం పసుపు, కుంకుమ, నెయ్యి, బుక్క గులాబ్, అత్తర్, పన్నీర్, నూనె, సుగంధద్రవ్యాలు కలిపి తలంబ్రాలను సిద్ధం చేశారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సర్పంచ్‌‌ పూనెం కృష్ణ దొర, ఈవో దామోదర్‌‌రావు పాల్గొన్నారు. అనంతరం ఫాల్గుణపూర్ణిమను పురస్కరించుకొని ఆలయ బేడా మండపంలో స్వామివారికి డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీసీతారామచంద్రస్వామికి విశేష స్నపనం చేశారు.

ప్రధాన ఆలయంలోని ధృవమూర్తులకు, గోదాదేవి అమ్మవారికి, లక్ష్మీతాయారు అమ్మవారికి, ఆంజనేయస్వామి వారికి వసంతాన్ని శాస్త్రోక్తంగా చల్లి అనంతరం కల్యాణమూర్తులపై చల్లారు. చివరగా వసంతోత్సవానికి చిహ్నంగా భక్తులపై పసుపు నీళ్లు చల్లారు. సాయంత్రం సీతారామచంద్రస్వామికి తిరువీధి సేవ నిర్వహించారు. 

జైశ్రీరాం ఇటుకల అమ్మకం ప్రారంభం

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో తయారుచేసిన జై శ్రీరాం ఇటుకల అమ్మకాన్ని బుధవారం సాయంత్రం ఈవో దామోదర్‌‌రావు ప్రారంభించారు. గతేడాది నవంబర్​ 11న అప్పటి కలెక్టర్‌‌ జితేశ్‌‌ వి.పాటిల్‌‌ బెంగళూరు నుంచి మోల్ట్‌‌లను తెప్పించి జైశ్రీరాం ఇటుకల తయారీని ప్రారంభించారు. ఇండ్లు, ఇతర నిర్మాణాలు చేపట్టే సమయంలో రామానుగ్రహం కలిగేలా ఈ ఇటుకలను  భక్తులకు అమ్మాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే బుధవారం ప్రత్యేకంగా కౌంటర్‌‌ ఏర్పాటుచేసి అమ్మకాలు ప్రారంభించారు. ఒక్కో ఇటుకను రూ.60లకు అమ్ముతున్నట్లు తెలిపారు. 

ఆన్‌‌లైన్‌‌లో రాములోరి తలంబ్రాలు 

సీతారాముల కల్యాణ తలంబ్రాల ఆన్‌‌లైన్‌‌ బుకింగ్‌‌ను బుధవారం ఈవో దామోదర్‌‌రావు ప్రారంభించారు. bhadradritemple.telangana.gov.in దేవస్థానం వెబ్‌‌సైట్‌‌లో బుక్‌‌ చేసుకోవచ్చని సూచించారు. ఒక్కో ప్యాకెట్‌‌ ధర రూ.60లుగా నిర్ణయించినట్లు
 వెల్లడించారు.