మీ పిల్లలకు ఇట్లాంటి అన్నమే పెడ్తారా..? : కలెక్టర్ అంకిత్

మీ పిల్లలకు ఇట్లాంటి అన్నమే పెడ్తారా..? : కలెక్టర్ అంకిత్

భద్రాద్రికొత్తగూడెం/ దమ్మపేట, వెలుగు: మీ పిల్లలకు కూడా ఇట్లాంటి అన్నమే పెడ్తారా అంటూ భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ అంకిత్​ హెచ్ఎంలు, టీచర్లు, వంట సిబ్బందిపై మండిపడ్డారు. బుధవారం దమ్మపేట తహసీల్దార్​ ఆఫీస్​లో అన్ని విభాగాలను తనిఖీ చేశారు. అనంతరం తెలంగాణ గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలతో పాటు పలు స్కూల్స్​ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనాన్ని రుచి చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం చికెన్ బగారా రైస్​ వడ్డించాల్సి ఉన్నప్పటికీ ఎందుకు వండలేదని ప్రశ్నించారు.

నాణ్యతతో కూడిన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలన్నారు. భవిష్యత్తులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సీరియస్​గా యాక్షన్​ తీసుకుంటానని హెచ్చరించారు. స్టూడెంట్స్​ చేతులు శుభ్రం చేసుకునే ప్రదేశంలో నల్లాలకు ఆన్ ఆఫ్ ట్యాప్​లు లేకపోవడం, అపరిశుభ్రతపై సీరియస్​ అయ్యారు. ఆయన వెంట తహసీల్దార్​ రాం నరేశ్, ఎంపీడీవో రవీందర్​ రెడ్డి, ఎంఈవో జగదీశ్ ఉన్నారు.