ఎవరి పేరు విన్నంతనే రెండు చేతులూ కలిపి నమస్కరిస్తామో, రెండు కనులూ అప్రయత్నంగా మూసుకుంటాయో... ఆ పేరు శ్రీ రాముడు. ఆదర్శ దంపతులైన సీతారాముల కల్యాణానికి భద్రాచలం క్షేత్రం పెట్టింది పేరు. భద్రాద్రిలో మార్చి 27న శ్రీ సీతారామ కల్యాణం, 28న శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది. రాముని కల్యాణం అత్యంత వైభవంగా దక్షిణ అయోధ్యగా అలరారే భద్రాచల పుణ్యక్షేత్రంలో ఆరుబయట జరిపించడమనే సంప్రదాయం సర్వమానవ సౌభ్రాతృత్వానికి చిహ్నంగా నిలుస్తోంది. భద్రాచలం సర్వ సంపదలకు నిలయం.
సకల జన, లోక సంరక్షణే శ్రీరామనవమి పరమార్థం. శ్రీరాముని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత గల క్షేత్రం భద్రాచలం. రామదాసు సూచించిన ఆరుబయటి విశేష స్థలం మిథిలా కల్యాణ మండపంగా నేడు అలరారుతోంది. శ్రీరాముడు సత్యపాలకుడు. ధర్మాచరణ తప్పనివాడు, ఏకపత్నీ వ్రతుడు, పితృ, మాతృ, భాతృ, సదాచారం, నిగ్రహం, సర్వ సద్గుణాలు మూర్తీభవించిన దయాహృదయుడు. శ్రీరామనవమి రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేతంగా ఆరాధించి, వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించుకుంటారు.
ఆధ్యాత్మిక శోభ
కోసల దేశాధీశ్వరుడైన దశరథుడు, కౌసల్యకు చైత్రశుద్ధ నవమి, పునర్వసు నాలుగో పాదాన కర్కాటక లగ్నంలో శ్రీరాముడు పుట్టాడు. ప్రతి సంవత్సరం చైత్రశుద్ద నవమి రోజున శ్రీరామ జయంతి వేడుకగా జరుపుకుంటాం. అదే ముహూర్తంలో జానకీదేవిని పరిణయమాడాడు. శ్రీరామనవమి రోజున సీతారామ కల్యాణం జరపడం అనాదిగా ఆచారంగా వస్తున్నది. శ్రీ సీతారామ కల్యాణం. రాముడు రావణుడిని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చిందీ శ్రీరామ నవమినాడే. ఆ మరుసటిరోజు దశమినాడు శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన భద్రాచల రామాలయాన్ని నవాబుల కాలంలో క్రీ.శ 17వ శతాబ్దంలో కంచర్ల గోపన్న నిర్మించారు. తెలంగాణకి మకుటాయమానమై ఆధ్యాత్మిక శోభ, భక్తిభావన ప్రభవించే మహా పుణ్యక్షేత్రం భద్రాచలం. భారతదేశంలో రామాలయం లేని గ్రామం ఉండదనడం అతిశయోక్తికాదు. సీతారాముల కల్యాణానికి శుభలగ్న, శుభ ముహూర్తాలు పేర్కొంటూ ఆహ్వానించే పెండ్లిపత్రికతో శ్రీకారం చుట్టి, చలువ పందిళ్లలో సంప్రదాయబద్ధంగా త్రేతాయుగంనాటి సీతారాముల కల్యాణాన్ని తలపిస్తుంది. మొదట మూలవిరాట్టుకు వివాహం జరిపించి, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల విగ్రహాలను మిథిలా కల్యాణ మంటపానికి తీసుకువస్తారు.
కన్నుల పండువగా కల్యాణం
వేదమంత్రాల మధ్య కన్నుల పండువగా సీతారాములు కల్యాణం నేడు భద్రాచలంలో జరగనుంది. అభిజిత్ లగ్నంలో జీలకర్ర, బెల్లం సీతారాముల శిరస్సుల పైనుంచి పుట్టింటివారు, అత్తింటివారు, రామదాసు చేయించిన మూడు మంగళ సూత్రాలనూ రామయ్యకు తాకించి సీతమ్మకి ధరింపజేయడం భద్రాద్రిక్షేత్ర ఆచారం. భద్రాచలం రాముని పెళ్లిలో ముత్యాల తలంబ్రాలకు వైశిష్ట్యం ఉన్నది. హైదరాబాద్ ముత్యాలకు నెలవు. కనుక నాటి గోల్కొండ ప్రభువు తానీషా కాలం నుంచీ పాలకులే భద్రాద్రికి ముత్యాల తలంబ్రాలు తీసుకురావడం ఆనవాయితీ. అదే సంప్రదాయాన్ని నేటికీ రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా స్వామివారికి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. ఆయనతోపాటు పలువురు మంత్రులు, తదితర ప్రముఖులు కల్యాణాన్ని వీక్షించనున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి స్వామి, అమ్మవార్లకు కానుకలు సమర్పించటం అనాదిగా వస్తోంది.
మిథిలా మండపంలో
శ్రీరామ పట్టాభిషేకం
శ్రీరాముని జన్మనక్షత్రం పునర్వసు, జన్మతిథి చైత్రశుద్ద నవమి శుభ ఘడియల్లో అభిజిత్ లగ్నమందు మధ్యాహం 12 గంటలకు అమ్మవారికి, స్వామివారికి శుభ ముహూర్తాన జీలకర్ర బెల్లం శిరస్సులపై ఉంచి కల్యాణ తంతు జరిపిస్తారు. సూర్యవంశీకుడైన శ్రీరామునికి ప్రీతిపాత్రమైనదగుటచే ఇక్కడి కల్యాణ తలంబ్రాలు కూడా ఎరుపు వర్ణంలో ఉండటం మరో ప్రత్యేకత. స్వామి, అమ్మవార్ల కల్యాణం సందర్భంగా నవాబుల కాలం నుంచి ఏనుగు అంబారీపై ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు కానుకగా సమర్పించే సంప్రదాయం ఉన్నది. మిథిలా మండపంలోనే నవమి మరుసటి రోజు వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం, రథోత్సవం జరుగనున్నాయి. పట్టాభిషేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా హాజరవుతున్నారు. శ్రీరామనవమి ఉత్సవ కార్యక్రమాలను కళ్ళకు కట్టేవిధంగా ఆకాశవాణి, దూరదర్శన్, ఇతర వార్తా చానళ్ళు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. భద్రాచల దివ్యక్షేత్రంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు లక్షలాది భక్తులు రానున్నట్లు అధికారుల అంచనా. మిథిలా ప్రాంగణంలో భక్తులు కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు తెలంగాణ నుంచేకాక ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో తరలివస్తారు. సీతారాముల ఆశీస్సులతో జన్మ సార్థకం చేసుకుందాం.
- నందిరాజు
రాధాకృష్ణ,
వెటరన్ జర్నలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
