మాపై ఎందుకింత కక్ష.. ఇలాగే నీట మునిగి సచ్చిపోవాలా?

మాపై ఎందుకింత కక్ష.. ఇలాగే నీట మునిగి సచ్చిపోవాలా?
  • భైంసాలో గుండేగాం గ్రామస్తుల ఆందోళన

భైంసా, వెలుగు: ఏటా వందల ఇళ్లు, వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునుగుతున్నా సర్కారు పట్టించుకోవట్లేదని నిర్మల్​జిల్లాలోని గుండేగాం గ్రామస్తులు రోడ్డెక్కారు. శుక్రవారం భైంసాలోని నేషనల్​హైవే 61పై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ముంపు బాధితులు మాట్లాడుతూ పదేండ్లుగా వర్షా కాలంలో ఊరు మునుగుతూ వస్తోందని చెప్పారు. ఏటా అది చేస్తం.. ఇది చేస్తం.. అంటూ అధికార పార్టీ లీడర్లు హామీలు ఇస్తున్నారే తప్ప చేసిందేమీ లేదని అన్నారు. ఇలాగే నీళ్లలో మునిగి సచ్చిపోవాలా అంటూ కన్నీరు పెట్టుకున్నారు. టీఆర్ఎస్ సర్కారు తమపై ఎందుకింత కక్ష చూపిస్తుందో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక నేతలు, అధికారుల మాటలపై నమ్మకం లేదని.. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రకటించే వరకు ఇక్కడి నుంచి కదిలేదని తేల్చిచెప్పారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తక్షణమే ఇక్కడికి వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, నాయకులు ఆందోళనకు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఏఎస్పీ కిరణ్ ఖారే, సీఐలు ప్రవీణ్ కుమార్, చంద్రశేఖర్, ఎస్సైలు నచ్చజెప్పి పంపించే ప్రయత్నం చేశారు. అయినా వినకపోవడంతో ట్రాఫిక్​ నిలిచిపోతుందని ఆందోళనకారులను అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు. దాదాపు 6 గంటలపాటు ధర్నా జరగగా భారీగా ట్రాఫిక్​నిలిచిపోయింది.