- నాగోల్ ఎస్టీపీ నుంచి పైప్‌లైన్
- ప్రాజెక్టుకు రూ. 906 కోట్ల ఖర్చు
- ఏడాదికి రూ.80 కోట్ల ఆదాయమే లక్ష్యం
- సక్సెస్ అయితే దేశంలోనే తొలి గ్రేవాటర్ ప్రాజెక్టుగా రికార్డు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత్ ఫ్యూచర్ సిటీ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. రాబోయే కాలంలో ఎంతో కీలకంగా మారనున్న ఫ్యూచర్ సిటీలో భారీ నిర్మాణాలు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో నీటి సమస్య రాకుండా వాటర్‌బోర్డు పక్కా ప్లాన్లు రూపొందిస్తోంది. ముఖ్యంగా నిర్మాణాల కోసం నీటి డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ఎస్టీపీల నుంచి శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసేందుకు ప్లాన్లు రూపొందిస్తోంది. దీని కోసం సిటీలోని నాగోల్ఎస్టీపీ నుంచి శుద్ధి చేసిన నీటిని (గ్రేవాటర్)ను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీని కోసం ప్రత్యేకంగా డీపీఆర్ తయారు చేసేందుకు త్వరలోనే టెండర్లను పిలవాలని అధికారులు నిర్ణయించారు.
నిర్మాణాలకు ఈ రీసైకిల్డ్వాటర్ ఉపయోగించడం వల్ల ఎలాంటి సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు. తాగడానికి కాకుండా భవన నిర్మాణాలకు, ఉద్యానవనాలకు, ఇతర అవసరాలకు మాత్రమే వినియోగించుకునేలా చేస్తామంటున్నారు.
వాటర్‌బోర్డు చేపట్టే ఈ గ్రేవాటర్ ప్రాజెక్ట్‌కు రూ.906 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక నీటి అమ్మకాల ద్వారా బోర్డుకు ఏడాదికి దాదాపు రూ.80 కోట్ల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది సక్సెస్ అయితే దేశంలోనే తొలి గ్రేవాటర్ ప్రాజెక్టుగా రికార్డులకు ఎక్కనున్నది.
నాగోల్ ఎస్టీపీ నుంచి ఫ్యూచర్ సిటీకి పైప్‌లైన్
ప్రస్తుతం నాగోల్ఎస్టీపీలో శుద్ధి అవుతున్న నీటిని మూసీలోకి వదిలేస్తున్నారు. త్వరలో మరికొన్ని ఎస్టీపీల నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉండడంతో నాగోల్‌లో శుద్ధి చేసిన నీటిని వాణిజ్య అవసరాలకు వాడేలా అధికారులు ప్లాన్లు రూపొందించారు.
నాగోల్ నుంచి గౌరెల్లి, సాగర్ రింగ్ రోడ్ మీదుగా తుర్కయాంజాల్, ఆదిబట్ల (ఐటీ హబ్) వరకూ తిరిగి అక్కడి నుంచి శ్రీశైలం హైవేకు సమాంతరంగాఫ్యూచర్ సిటీ వరకూ 65 కి.మీ. పరిధిలో 2000 ఎంఎం డయా పైప్‌లైన్ వేయనున్నారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో స్టోరేజీ రిజర్వాయర్లు, ఇంటర్నల్పైప్లైన్లు వేయనున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి డీపీఆర్తయారీకి టెండర్లను ఆహ్వానించనున్నారు.
ఇప్పటికే ఓ ఏజెన్సీ ద్వారా నిర్వహించిన సర్వేలో పైప్‌లైన్, పంపింగ్, డెలివరీ, స్టేషన్లు, విద్యుత్ సౌకర్యం తదితర నిర్మాణ వ్యయంపై ప్రాథమిక నివేదిక సమర్పించినట్టు ఒక అధికారి
తెలిపారు.
త్వరలో స్పెషల్ యాప్
గ్రేటర్లో ఎస్టీపీల నిర్వహణ, గణాంకాలను ఎప్పటికప్పుడు రికార్డు చేయడానికి ప్రత్యేక యాప్‌ను రెడీ చేయాలని మెట్రో వాటర్ బోర్డు నిర్ణయించింది. శుద్ధి చేసిన నీటిని ఇకపై మూసీలోకి వదలకుండా వాణిజ్య అవసరాలకు అమ్మడానికి ఆలోచన చేస్తున్నది.
అలాగే ఎస్టీపీల నుంచి వచ్చే నీటిని పక్కాగా లెక్కకట్టి, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న గార్డెనింగ్, సెంట్రల్ మీడియన్లకు సరఫరా చేసేందుకు హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నది. ఓఆర్ఆర్ వెంట శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయడానికి పైప్‌లైన్ నిర్మాణానికి డీపీఆర్ రూపొందించాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు.
