తెలంగాణలో 375 కిలో మీటర్ల మేర రాహుల్ యాత్ర

తెలంగాణలో  375 కిలో మీటర్ల మేర రాహుల్ యాత్ర

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’కు తెలంగాణలో రూట్ మ్యాప్ ఖరారైంది. తెలంగాణలో మొత్తం 375 కిలోమీటర్ల మేర రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్‌ వద్ద రాహుల్‌ పాదయాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించి... జహీరాబాద్ జిల్లా మద్నూర్‌ వరకు కొనసాగుతుంది. ఈ నెల 23 నుంచి వచ్చే నెల 6 వరకు రాహుల్ యాత్ర రాష్ట్రంలో కొనసాగనుంది. 

ఈ మేరకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ ప్రకటన రిలీజ్ చేశారు. భారత్ జోడో యాత్ర గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని, ఇందుకోసం పంచాయతీ భవన పరిసరాలలో వాల్ రైటింగ్స్ చేయించాలని పార్టీ నాయకులను కోరారు. రాహుల్ యాత్ర ఆద్యంతం ప్రతి రెండు కిలో మీటర్లకు ఓ నాయకుడు బాధ్యత తీసుకొని యాత్ర సజావుగా సాగేలా చూడాలని చెప్పారు. ప్రస్తుతం రాహుల్ కర్ణాటకలో పాదయాత్ర చేస్తున్నారు.

రూట్ వివరాలివీ.. 

రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర  ఈనెల 23న  మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని మక్తల్ వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. అదే నియోజకవర్గంలోని మహబూబ్ నగర్ టౌన్, జడ్చర్ల, షాద్ నగర్ మీదుగా ముందుకు సాగుతుంది. అనంతరం శంషాబాద్, ఆరాంఘర్, బహదూర్ పురా, చార్మినార్, మోజంజాహి మార్కెట్, గాంధీ భవన్, బోయినపల్లి, బాలా నగర్, కూకట్ పల్లి, మియాపూర్, పటాన్ చెరు, ముత్తంగి, సంగారెడ్డి క్రాస్ రోడ్, జోగిపేట్, శంకరంపేట్, మద్నూర్ వరకు కొనసాగుతుంది. అక్టోబర్ 24, 25, నవంబర్ 3 తేదీల్లో యాత్రకు బ్రేక్ ఉంటుంది.