తెలంగాణలో ప్రవేశించిన రాహుల్ భారత్ జోడో యాత్ర

తెలంగాణలో ప్రవేశించిన రాహుల్ భారత్ జోడో యాత్ర
  • తెలంగాణలోకి అడుగుపెట్టిన రాహుల్ జోడో యాత్ర
  • ఘనస్వాగతం పలికిన శ్రేణులు
  • 13 రోజుల పాటు రాష్ట్రంలో పాదయాత్ర
  • ఘన స్వాగతం పలికిన నేతలు, క్యాడర్
  • నాలుగు రాష్ట్రాలు దాటి ఐదో రాష్ట్రంలో అడుగు పెట్టిన యాత్ర

సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. కర్నాటక రాయచూర్ నుంచి కృష్ణానది మీదుగా నారాయణ పేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో రాహుల్ అడుగుపెట్టారు. పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. తెలంగాణలోకి ప్రవేశించిన అనంతరం కర్నాటక పీసీసీ డీకే శివ కుమార్.. రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి జాతీయ జెండాను అందజేశారు. రాహుల్ పాదయాత్ర ఇప్పటికి 4రాష్ట్రాల్లో పూర్తికాగా.. తెలంగాణ ఐదోవది. రాష్ట్రంలో అడుగుపెట్టిన రాహుల్ గాంధీని చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. 

రాహుల్ గాంధీ ఆదివారం ఉదయం 6 నుంచి 11 గంటల వరకు పాదయాత్ర చేయనున్నారు. అనంతరం మూడు రోజుల పాటు విరామం తీసుకోనున్నారు. దీపావళి పండుగ, 26న ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు ఆయన 24 నుంచి 26 వరకు యాత్రకు బ్రేక్ ఇవ్వనున్నారు. మక్తల్‌‌‌‌‌‌‌‌లో ఉదయం పాదయాత్ర పూర్తైన తర్వాత రాహుల్ ఢిల్లీకి వెళ్తారు. 27న తిరిగి పాదయాత్ర మొదలుపెడతారు. రాష్ట్రంలో రాహుల్ యాత్ర 13 రోజుల పాటు సాగనుంది. భారత్ జోడో యాత్ర 31న శంషాబాద్ మీదుగా హైదరాబాద్లోకి ప్రవేశిస్తుంది. సెప్టెంబర్ 1, 2 తేదీల్లో హైదరాబాద్​లో యాత్ర చేసి కూకట్​పల్లి, బీహెచ్ఈఎల్ మీదుగా సంగారెడ్డికి వెళ్తారు.

తెలంగాణలో రాహుల్ పాదయాత్రలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. రాహుల్‌తో కలిసి పాదయాత్రలో నడుస్తున్నారు. రాహుల్ జోడో యాత్ర సందర్భంగా పోలీసులు మక్తల్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీపావళి పండుగ సందర్భంగా రాహుల్ భారత్ జోడో యాత్రకు మూడు రోజుల విరామం ఇవ్వనున్నారు. ఇవాళ యాత్ర అనంతరం రాహుల్ ఢిల్లీకి వెళ్లనున్నారు.  కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఈనెల 26న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కూడా రాహుల్ హాజరవుతారు. ఆ తర్వాత 27 నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలో కొనసాగనుంది. తెలంగాణలో మొత్తం 13 రోజుల పాటు 375 కిలోమీటర్ల మేర రాహుల్ నడవనున్నారు. నవంబర్ 7 వరకు రాష్ట్రంలో రాహుల్ జోడో యాత్ర కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మక్తల్ నుంచి హైదరాబాద్ మీదుగా మద్నూర్ వరకు రాహుల్ పాదయాత్ర చేసేందుకు టీ కాంగ్రెస్ నేతలు రూట్ మ్యాప్ సిద్దం చేశారు. నవంబర్​7న కామారెడ్డిలోని మద్నూర్ నుంచి భారత్​జోడో యాత్ర మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది.