‘గృహజ్యోతి’తో 52.82 లక్షల మందికి లబ్ధి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

‘గృహజ్యోతి’తో 52.82 లక్షల మందికి లబ్ధి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  •     లబ్ధిదారుల తరపున రూ.3,593 కోట్ల బిల్లుల చెల్లించినం  
  •     మండలిలో డిప్యూటీ సీఎం భట్టి వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గృహజ్యోతి స్కీమ్ తో 52.82 లక్షల కుటుంబాలు ప్రతి నెలా లబ్ధి పొందుతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. 200 యూనిట్లలోపు ఫ్రీ కరెంట్  వాడుకుంటున్న లబ్ధిదారుల పక్షాన 2024 మార్చి నుంచి 2025 డిసెంబర్  వరకు రూ.3,593 కోట్ల బిల్లులను డిస్కంలకు చెల్లించామని ఆయన ప్రకటించారు. 

శాసన మండలిలో శుక్రవారం జరిగిన మార్నింగ్  సెషన్ లో గృహజ్యోతి పథకం అమలుపై ఎమ్మెల్సీ విజయశాంతి అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబులిచ్చారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు గృహజ్యోతితో పేద, మధ్య తరగతి కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయన్నారు.  

యూరియా నిల్వలపై అపోహలు వద్దు: తుమ్మల

యూరియా కష్టాలపై మండలిలో కాసేపు చర్చ జరిగింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను బీఆర్ఎస్  ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు  మండలి ముందు వివరించారు. దీనికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో వెయ్యికి పైగా కంపెనీలు యూరియా దుర్వినియోగం చేస్తున్నాయని చెప్పారు. దీంతో అసలైన రైతులకు యూరియాను అందించడానికి ప్రత్యేక యాప్ తీసుకొచ్చామని, ఆ యాప్ ను 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. యూరియా యాప్  అపోహలు, గందరగోళం సృష్టించవద్దని కోరారు. 

పంట నష్టంపై ఎమ్మెల్సీ తీన్మార్  మల్లన్న, సేంద్రియ పంటల సాగుపై దాసోజు శ్రవణ్  అడిగిన ప్రశ్నలకు మంత్రి జవాబు ఇచ్చారు. కేంద్రం అమలుచేసిన పరంపర గతి కృషి వికాస్  యోజన స్కీమ్ ను గత బీఆర్ఎస్  ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్లే రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయం తగ్గిందన్నారు. 

356 కోట్లతో కొండగట్టు మాస్టర్ ప్లాన్: సురేఖ

కొండగట్టు అంజనేయస్వామి టెంపుల్ అభివృద్ధికి రూ.356 కోట్లతో మాస్టర్ ప్లాన్  రూపొందించి పనులు చేపడతామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. కొండగట్టుపై ఎమ్మెల్సీ రమణ, చౌటుప్పల్  కాలుష్యంపై ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అడిగిన ప్రశ్నలకు మంత్రి జవాబు చెప్పారు. గత బీఆర్ఎస్   ప్రభుత్వం కొండగట్టు కోసం రూ.100 కోట్లు కేటాయించినట్లు జీఓ ఇచ్చి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. 

అలాగే ‘బాసర టు భద్రాచలం’ టెంపుల్ టూరిజం అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఇక చౌటుప్పల్  ఏరియాలోని దొంతిగూడెం క్లస్టర్, మల్కాపూర్  క్లస్టర్ పరిధిలో పరిశ్రమల వల్ల ఏర్పడుతున్న జల, వాయు కాలుష్యంపై చర్యలు తీసుకుంటున్నామని సురేఖ పేర్కొన్నారు.

బలహీన వర్గాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక: పొన్నం 

రాష్ట్రంలో బలహీన వర్గాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందుకుపోతామని మంత్రి పొన్నం ప్రభాకర్  అన్నారు. ఎమ్మెల్సీలు బండా ప్రకాష్, తక్కళ్లపల్లి రవీందర్రావు, తీన్మార్  మల్లన్న అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఆత్మగౌరవ భవనాలకు సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వచ్చే బడ్జెట్  సమావేశాల్లోపు బీసీ ప్రజా ప్రతినిధులు, లీడర్లతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.  గతంలో 13 బీసీ కార్పొరేషన్లు ఉండగా తమ ప్రభుత్వం వచ్చిన తరువాత మరో 8 కార్పొరేషన్లు, ఒక ఈబీసీ బోర్డు ఏర్పాటు చేశామని తెలిపారు.