తెలంగాణ ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించాం: భట్టి

తెలంగాణ ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించాం: భట్టి

ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయిన తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. మోదీతో మాట్లాడిన విషయాలను మీడియాకు తెలియజేశారు భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మొదటిసారి ప్రధాని నరేంద్రమోదీని కలవడం తమకు సంతోషంగా ఉందన్నారు భట్టి విక్రమార్క. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా విభజన చట్టంలో తెలంగాణ కోసం ఇచ్చిన హామీలను ప్రధాని దృష్టికి తీసుకొచ్చామన్నారు. పెండింగులో ఉన్న ప్రాజెక్టులను, నిధుల పట్ల ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని చెప్పారు. 

భట్టి ఏమన్నారంటే..?   

* తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని ప్రధాని మోదీని కోరాం

* తెలంగాణ రాష్ట్ర సమస్యలను ప్రధానికి వివరించాం

* రాష్ర్ట విభజన సమయంలో ఇచ్చిన అనేక అంశాలను మోదీ దృష్టికి తీసుకెళ్లాం

* రాష్ట్ర విభజన సందర్భంగా.. కేంద్రం నుంచి రావాల్సిన కొన్ని ముఖ్యమైనవి ప్రాజెక్టులను, నిధులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం  తీసుకురాలేదని, వాటిని త్వరగా తెలంగాణ రాష్ట్రానికి అందించాలని విజ్ఞప్తి చేశాం 

* బయ్యారంలో స్టిల్ ప్లాంట్, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని, ఐటీఐఆర్ ప్రాజెక్టును వెంటనే మంజూరు చేయాలని కోరాం 

* విభజన హామీలో పొందుపర్చిన విధంగా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశాం 

* ఒక ఐఐఎం ప్రాజెక్టును హైదరాబాద్ కు మంజూరు చేయాలని కోరాం 

* రాష్ట్రానికి ఒక సైనిక్ స్కూలును ఏర్పాటు చేయాలని తెలిపాం 

* నేషనల్ హైవే ఆథారిటీకి సంబంధించి.. 14 ప్రతిపాదనలను పెండింగులో ఉన్నాయని, వాటిని పరిగణలోకి తీసుకుని వెంటనే ఆమోదం తెలపాలని కోరాం 

* వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన నిధులు కొన్నేండ్లుగా పెండింగులో ఉన్నాయని, వాటిని వెంటనే రిలీజ్ చేయాలని కోరాం 

* 2020-21 నుంచి 23-24 వరకు రూ. 1,800 కోట్లు పెండింగులో ఉన్నాయని, వాటిని విడుదల చేయాల్సిందిగా అడిగాం 

* మిగతా పెండింగులో ఉన్న రూ.450 కోట్ల నిధులు విడుదల చేయాలని అడిగాం 

* నీటి పారుదల, విద్య, వైద్యం సహా అన్ని రంగాల్లో కేంద్ర సహకారాన్ని కోరాం 

* గవర్నమెంటు ఆఫ్ ఇండియా నుంచి రావాల్సిన 2 వేల 250 కోట్ల నిధులను సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేయాలని కోరాం 

* బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేశారని, తలకు మించిన అప్పులు తీసుకొచ్చి రాష్ట్రంపై పెను భారం మోపారని ప్రధాని మోదీకి వివరించాం. ఇంకా అదనంగా కూడా కేంద్రం నుంచి సాధ్యమైనంత మేరకు సాయం చేయాలని కోరాం

* రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం కేంద్ర స్థాయి నుంచి సాయం అందించాలని కోరాం 

* రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఉన్న సమాచారాన్ని ప్రధానికి వివరించి చెప్పాం 

* శ్వేత పత్రం గురించి కూడా ప్రధానికి తెలియజేశాం 

* మోదీ సానుకూలంగా స్పందించారు. తప్పనిసరిగా తెలంగాణకు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు