విద్యుత్ శాఖలో ఏడాదికి రూ.16 వేల కోట్ల సబ్సిడీ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

విద్యుత్ శాఖలో ఏడాదికి రూ.16 వేల కోట్ల సబ్సిడీ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  •     వ్యవసాయ రంగానికి రూ.13,499 కోట్లు
  •     200 యూనిట్ల ఉచిత కరెంట్‌కు 2,086 కోట్లు అందిస్తున్నం
  •     శాసనసభలో ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో విద్యుత్​ శాఖ పరిధిలో వివిధ పథకాల కింద ఏటా రూ.16 వేల కోట్ల రాయితీని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.  వ్యవసాయ రంగానికి ఉచిత కరెంట్​ అందజేసేందుకు పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. మంగళవారం  శాసనసభలో విద్యుత్​ శాఖపై జరిగిన చర్చ సందర్భంగా.. ఏయే రంగాలకు ఎంతెంత? మొత్తంలో సబ్సిడీ నిధుల ఖర్చు? ను లెక్కలతో సహా వెల్లడించారు.  

రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర, దక్షిణ తెలంగాణ విద్యుత్​ పంపిణీ సంస్థల తరఫున 29 లక్షల23 వేల559 వ్యవసాయ విద్యుత్​ కనెక్షన్లకుగానూ ఈ ఏడాది రూ.13, 499 కోట్లు ఖర్చుచేశామని ప్రకటించారు. తమ ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నదని చెప్పారు.  రైతులకు నాణ్యమైన ఉచిత కరెంట్​ అందిస్తున్నామని వివరించారు. 

గృహలక్ష్మి స్కీమ్‌కు..

రాష్ట్రవ్యాప్తంగా గృహలక్ష్మి స్కీమ్‌ కింద నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్​ ఉపయోగించుకుంటున్న 52 లక్షల 82 వేల 498 మందికి  ఏటా రూ.2,086  కోట్ల సబ్సిడీ అందజేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.  ప్రతినెలా కరెంట్​ బిల్లుల రూపేణా ఖర్చు చేసే రూ.500 వరకు డబ్బులు ఆదాకావడంతో.. పిల్లల చదువుల కోసం ఉపయోగించుకుంటున్నామని పేద తల్లిదండ్రులు తెలిపారన్నారు. 

34, 030 నాయీ బ్రాహ్మణుల సెలూన్లుకు రూ.25 కోట్లు, 70, 732 రజకుల లాండ్రీషాప్‌ల నిర్వహణకు రూ.71 కోట్లు, 59 ధోబీ ఘాట్లకు రూ.14 లక్షలు, 52 స్పిన్నింగ్​ మిల్స్‌కు సబ్సిడీ రాయితీ కింద రూ.88 కోట్లు, 6 , 988 చేనేత కార్మికులు ఉపయోగించే పవర్​లూమ్స్​ కరెంట్​ బిల్లులు రూ.2.5 కోట్లు, రాష్ట్ర వ్యాప్తంగా 29 , 690 ప్రభుత్వ పాఠశాలల కరెంట్​ బిల్స్​ రూ.142 కోట్లు, 88, 907 చోట్ల గణేష్​ మండపాలకు ఫ్రీ కరెంట్​ అందివ్వడానికి రూ.32.5 కోట్లు ప్రభుత్వమే చెల్లించినట్టు డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించారు.