ప్రధాని మోడీకి భట్టి లేఖ

ప్రధాని మోడీకి భట్టి లేఖ

హైదరాబాద్, వెలుగు: ఏపీ పునర్విభజన చట్టం ఆమోదించి 8 ఏండ్లు కావొస్తున్నా, ఇంత వరకు ఒక్క హామీ అమలు కాలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. విభజన చట్టంలోని అమలు కాని10 హామీలను ప్రస్తావిస్తూ మోడీకి ఆయన శుక్రవారం లేఖ రాశారు. హైదరాబాద్ ఎన్నో సార్లు వచ్చినా విభజన హామీలను ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు. ప్రధాని మోడీ అటు పార్లమెంటులో, ఇటు బయట విభజన చట్టంలోని హామీలను ప్రస్తావించకపోగా, రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే తప్పుపడుతూ మాట్లాడటం తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరచటమేనన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ట్రైబల్​యూనివర్సిటీ, ఐఐఐటీ, ఐఐఎంల ఏర్పాటు, నిజామాబాద్ పసుపు బోర్డు, కొత్త పరిశ్రమలకు రాయితీలు, నవోదయ స్కూల్స్, యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఐటీఐఆర్ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం, తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్ట్ కు జాతీయ హోదా కల్పన, ఎన్టీపీసీ  ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి హామీలను అమలు చేయాలని లేఖలో కోరారు. కాంగ్రెస్ చచ్చిపోయిందంటూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కామెంట్ చేయడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని, కాంగ్రెస్ ను చంపడం ఎవరి తరం కాదని అన్నారు.