హైదరాబాద్, వెలుగు : మూసీ ప్రక్షాళనపై చర్చించి ప్రభుత్వానికి సహకరిద్దామని నది పరీవాహక ప్రాంత రైతులకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ సిటీ శివారు నాగోల్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో ఆయన అధ్యక్షతన హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ ఉమ్మడి జిల్లాల రైతులు, ప్రజలతో శనివారం ప్రత్యేక సమావేశం జరగనున్నది. ఈ నేపథ్యంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘‘మూడు ఉమ్మడి జిల్లాల రైతులు, ప్రజలు సమావేశానికి హాజరై విజయంతం చేయాలి.
గత ప్రభుత్వాలు మూసీ ప్రక్షాళనను విస్మరించాయి. మూసీ ప్రక్షాళనకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుడితే.. ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. వాళ్ల కుట్రలను తిప్పికొట్టాలి. మూసీ నదికి ఎంతో ఘన చరిత్ర ఉన్నది. నది నీళ్లు సాగు, తాగు, పాడి, మత్స్య అవసరాలకు ఉపయోగపడేవి. మానవ తప్పిదాల వల్ల మూసీ కాలుష్యమైంది. పంటలు సాగు చేసే పరిస్థితి కూడా లేదు’’అని చామల అన్నారు. మూసీని ప్రక్షాళన చేసి గోదావరి జలాలతో నింపి రైతులకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారని తెలిపారు.
మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్న ప్రతిపక్షాలకు రైతులు, ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ఒకప్పుడు నల్గొండ జిల్లా అంటేనే ఫ్లోరైడ్ గుర్తుకొచ్చేదని అన్నారు. ఫ్లోరోసిస్ వ్యాధితో బాధపడుతున్న జనాలు కండ్ల ముందు కనిపించే వాళ్లని, అలాంటి వ్యాధిని నివారించుకోగలిగామని గుర్తు చేశారు. మూసీ నది ప్రక్షాళనకు రైతులందరూ మద్దతు ప్రకటించాలని కోరారు.