మల్కాపూర్‌‌‌‌ - విజయవాడ వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌‌ప్రెస్ హైవే నిర్మించండి: కోమటిరెడ్డి

మల్కాపూర్‌‌‌‌ - విజయవాడ వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌‌ప్రెస్ హైవే నిర్మించండి: కోమటిరెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌‌ప్రెస్ హైవేని నిర్మించాలని ప్రధాని మోదీని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌‌ రెడ్డి కోరారు. అలాగే, తెలంగాణలో ప్రైవేట్ యూనివర్సిటీలు దోపిడీలపై కూడా ఫిర్యాదు చేశారు. శుక్రవారం పార్లమెంట్‌‌లో ప్రధాని మోదీతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చించారు. తర్వాత కోమటిరెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ – విజయవాడ మధ్యనున్న నేషనల్ హైవే – 65 తెలంగాణ, ఏపీ రాష్ట్రాలను కలిపే అత్యంత రద్దీ రోడ్డని పేర్కొన్నారు. ఎల్​బీనగర్ నుంచి మల్కాపూర్ వరకు దాదాపు 44 కి.మీ మేర 6 లేన్లుగా రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయని, దీంతో పాటు మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు ప్రస్తుత హైవేకు సమాంతరంగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌‌ప్రెస్‌‌వే నిర్మించాలని ప్రధానికి కోరినట్లు చెప్పారు. 

అలాగే, తెలంగాణలో ప్రైవేట్ యూనివర్సిటీ చట్టం–2018 ద్వారా అర్హత లేని సంస్థలకు వర్సిటీ హోదా కల్పించి, స్టూడెంట్ల జీవితాలతో రాష్ట్ర సర్కార్‌‌‌‌ ఆడుకుంటున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో 5 ప్రైవేట్ వర్సిటీల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపినా, గవర్నర్ ఆమోద ముద్ర వేయలేదన్నారు. అయినా 2022–23 విద్యా సంవత్సరానికి గురునానక్‌‌లో 2,800 మంది, శ్రీనిధిలో 300 మంది విద్యార్థులను చేర్చుకున్నారని చెప్పారు. విద్యా సంవత్సరం చివరినాటికి గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో స్టూడెంట్స్ ఒక ఏడాదిని కోల్పోయారని పేర్కొన్నారు. ఈ సంస్థలపై సీబీఐ, ఈడీ, ఇతర సంస్థలతో విచారణ చేయించాలని కోరి
నట్లు వెల్లడించారు. తన విజ్ఞప్తులపై ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు కోమటిరెడ్డి తెలిపారు.