పరిగి: వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో దొంగలు బరితెగిస్తున్నారు. ఇప్పటివరకు బైక్ చోరీలతో హడలెత్తించిన కేటుగాళ్లు.. ఇప్పుడు చిన్నారుల సైకిళ్లను కూడా వదలడం లేదు. పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డుకు చెందిన ముకుంద రవికుమార్ ఇంటి ముందు నిలిపి ఉంచిన తన కొడుకు సైకిల్ పట్టపగలే చోరీకి గురైంది. ఎవరో తెలియని వ్యక్తి ఎవరూ లేని సమయం చూసి, దర్జాగా సైకిల్ తీసుకుని అక్కడి నుండి పరారయ్యాడు.
ఈ చోరీ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో స్థానిక సోషల్ మీడియా గ్రూపుల్లో వైరల్ అవుతోంది. వరుస దొంగతనాలతో పరిగి పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు పగలు, రాత్రి గస్తీ పెంచి, ఇలాంటి చోరీలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
