రామప్ప చుట్టు ప్రాంతాల్లో భూముల కోసం ఎగబడుతున్న బడా కంపెనీలు

రామప్ప చుట్టు ప్రాంతాల్లో భూముల కోసం ఎగబడుతున్న బడా కంపెనీలు
  • ఆలయ పరిసర ప్రాంతాల్లో భూముల కోసం ఎగబడుతున్న బడా కంపెనీలు
  • హైదరాబాద్‌, వరంగల్‌‌ నుంచి స్థానికులకు ఫోన్ల మీద ఫోన్లు
  • ఇప్పటికే భూముల ధరలు రెట్టింపు ఎకరానికి రూ.40 లక్షల నుంచి కోటి పైమాటే
  • షాపుల ఏర్పాటుకు గజాల చొప్పున స్థలాల అమ్మకాలు
  • రానున్న రోజుల్లో మరింత పెరగనున్న జాగల రేట్లు

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: రామప్ప ఆలయ చుట్టుపక్కల భూములపై బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు కన్నేశాయి. వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌గా యునెస్కో గుర్తింపు పొందిన తర్వాతి రోజు నుంచే అక్కడ వ్యాపారాలు షురూ చేశాయి. ధర ఎంతైనా సరే చెల్లించి భూములను కొనేందుకు ముందుకు వస్తున్నాయి. అగ్రికల్చర్​ ల్యాండ్స్‌‌ కొని వెంచర్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో రామప్ప చుట్టూరా 10 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూముల ధరలు అమాంతం పెరిగాయి. గతంలో ఎకరానికి రూ.15 లక్షల నుంచి 20 లక్షల దాకా ఉన్న ధరలు ఇప్పుడు రూ.40 లక్షలకు పైగా పలుకుతున్నాయి. రోడ్లకు దగ్గర్లో ఉన్న భూముల రేట్లు ఏకంగా రూ. కోట్లల్లో ఉంటున్నాయి.
రేట్లు డబుల్
ములుగు జిల్లా వెంకటాపూర్‌‌ మండలం పాలంపేట గ్రామంలో రామప్ప టెంపుల్‌‌ ఉంది. ములుగు జిల్లా కేంద్రానికి 13 కి.మీ. భూపాలపల్లి జిల్లా కేంద్రానికి 25 కి.మీ. దూరంలో ఉంది. ఈ గుడికి యునెస్కో గుర్తింపు రాగానే చుట్టుపక్కల 30 కి.మీ దూరంలో ఉన్న గ్రామాల్లో భూముల ధరలు పెరిగాయి. జంగాలపల్లి నుంచి గాంధీనగర్‌‌ దాకా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ల్యాండ్స్‌‌ ధరలను ఓనర్లు డబుల్‌‌ చేసేశారు.  కొత్త జిల్లాల ఏర్పాటుతో ఇప్పటికే భూపాలపల్లి నుంచి గాంధీనగర్‌‌‌‌, ములుగు నుంచి జవహర్‌‌‌‌ నగర్‌‌‌‌ వరకు రియల్ ఎస్టేట్‌‌‌‌ వెంచర్లు వేశారు. ఇప్పుడు రామప్ప చుట్టూ రియల్ ఎస్టేట్‌‌‌‌ వెంచర్లు పడనున్నాయి.
యాదాద్రి టు రామప్ప రాష్ట్రంలో యాదాద్రి టెంపుల్‌‌‌‌ని ప్రభుత్వం అభివృద్ధి చేస్తుండటంతో గత మూడు, నాలుగు ఏళ్లుగా అక్కడ రియల్ ఎస్టేట్‌‌‌‌ బూమ్‌‌‌‌ విపరీతంగా పెరిగింది. హైదరాబాద్‌‌‌‌కు చెందిన ప్రముఖ కంపెనీలు యాదాద్రి చుట్టూ వెంచర్లు వేసి భూములను అమ్ముతున్నాయి. గజాల చొప్పున ఇళ్ల స్థలాలకు విక్రయిస్తున్నాయి. ఇప్పుడు అక్కడి కంపెనీలన్నీ రామప్ప టెంపుల్‌‌‌‌ దగ్గర ఉన్న భూములపై దృష్టి పెట్టాయి. రాబోయే రోజుల్లో ఇక్కడి భూములకు ధరలు బాగా పెరిగే అవకాశం ఉండటంతో తమ ఏజెంట్లను రంగంలోకి దింపాయి. ఎకరం, రెండు ఎకరాలు ఎంత దొరికితే అంత కొని రిజిస్ట్రేషన్‌‌‌‌ చేయించేలా ఏర్పాట్లు చేస్తున్నాయి.
ఖాళీ జాగ కోసం వెతుకులాట
పాలంపేట గ్రామంలో రోడ్డు వెంట ఉన్న భూముల అద్దెలు ఆకాశన్నంటుతున్నాయి. రాబోయే రోజుల్లో పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో అక్కడ షాపులు ఏర్పాటు చేసుకోవడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. సిటీల నుంచి వచ్చే వాళ్లు బస చేయడానికి అవసరమైన సౌకర్యాలు ఆలయం దగ్గర లేవు. దీంతో రామప్పకు దగ్గర్లో పెద్ద హోటళ్లు, షాపింగ్‌‌‌‌ మాల్స్‌‌‌‌ కట్టడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. గజానికి రూ.15 వేలకు పైగా చెల్లించి షాపు కట్టుకోవాలని భావిస్తున్నారు. కొందరైతే అడిగినంత ఇచ్చి ఇప్పటికే రోడ్డు వెంట ఉన్న భూముల్లో షాపుల ఏర్పాటు కోసం ఒప్పందాలు చేసుకుంటున్నారు. రోడ్డు వెంట షాపులు పెట్టుకోవడానికి ఆసక్తి చూపించే వారికి.. ఖాళీ జాగలను గజాల చొప్పున కొలిచి ఇస్తున్నారు.

హలో.. నేను హైదరాబాద్‌‌ నుంచి రమేశ్‌‌ని మాట్లాడుతున్న.. ఇక్కడ పెద్ద రియల్ ఎస్టేట్‌‌ కంపెనీలో మేనేజర్‌‌ని. రామప్పకు దగ్గర్లో 10 నుంచి 20 ఎకరాల భూమి దొరుకుతుందా.. aడబ్బు ఎంతైనా ఫర్వాలేదు. ఎకరానికి 40 లక్షలు అయినా కొంటాం. ఒకట్రెండు రోజుల్లో కనుక్కొని చెప్పండి బ్రదర్‌.

హాయ్‌‌.. నేను సురేశ్‌‌ని. యాదాద్రిలోని రియల్ ఎస్టేట్‌‌ ఆఫీస్‌‌ నుంచి కాల్‌‌ చేస్తున్నా. రామప్పకు దగ్గర్లోని వెంకటాపూర్‌‌లో 10 ఎకరాల భూమి అమ్మకానికి ఉందని తెలిసింది. నిజమేనా బ్రదర్‌‌. ధర ఎంతైనా సరే మేం కొంటాం. మా ఆఫీస్‌‌ తరఫున అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాం. మీరు మంచి భూములు చూపిస్తే ఎకరానికి ఇంత అని కమీషన్‌‌ ఇస్తం.
.. రామప్ప గుడికి దగ్గర్లోని గ్రామాల ప్రజలకు వస్తున్న ఫోన్లు ఇవి. రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చినప్పటి నుంచి ఈ కాల్స్ మొదలయ్యాయి. రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ ఆలయ చుట్టుపక్క ఏరియాల్లో భూములు కొనేందుకు ప్లాన్ చేస్తున్నాయి.
ఫోన్లు మోగుతూనే ఉన్నయ్..
ములుగు జిల్లాలోని జంగాలపల్లి, వెంకటాపూర్‌‌‌‌, పాలంపేట, రామాంజపూర్‌‌‌‌, గణపురం మండలంలోని గణపురం, బుద్దారం, గాంధీనగర్‌‌‌‌ గ్రామాల ప్రజలకు.. ములుగు, భూపాలపల్లి జిల్లా కేంద్రాల్లో నివసించే వాళ్లకు తమ బంధువులు, కొత్త వ్యక్తుల నుంచి ఫోన్‌‌‌‌ కాల్స్‌‌‌‌ పెరిగాయి. ‘రామప్పకు దగ్గర్లో మీకు తెలిసిన వాళ్లు ఎవరైనా భూములు అమ్మితే మాతో చెప్పండి’ అని అడుగుతున్నారు. ‘ఒక గుంట లేదా 2 గుంటలు అమ్మినా కొనడానికి రెడీ’ అని చెబుతున్నారు. భూమి చూపిస్తే .. ఎకరానికి ఇంత అని కమీషన్‌‌‌‌ ఆఫర్‌‌‌‌ చేస్తున్నారు. రామప్ప చుట్టుపక్కల గ్రామాల్లో ఎన్నడూ లేనిది భారీగా వెహికల్స్‌‌‌‌ చక్కర్లు కొడుతున్నాయి.