అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న వలసదారులకు అమెరికా ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. గ్రీన్ కార్డ్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో దరఖాస్తుదారులు దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ స్పష్టం చేసింది. ఇటీవల యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(USCIS) చేసిన ఒక ప్రకటన ఇమ్మిగ్రెంట్లలో తీవ్ర గందరగోళాన్ని, ఆందోళనను రేకెత్తించింది. అసాధారణ మినహాయింపులు ఉంటే తప్ప, మిగతా దరఖాస్తుదారులంతా తమ సొంత దేశాలకు వెళ్లి అక్కడి నుంచే గ్రీన్ కార్డ్ కోసం వేచి ఉండాలనేలా ఆ ప్రకటన రావటంతో వలసదారులు ఉలిక్కిపడ్డారు.
ఈ గందరగోళంపై శుక్రవారం స్పందించిన డీహెచ్‌ఎస్.. ఇమ్మిగ్రేషన్ విధానాల్లో ఎలాంటి మార్పులు చేయలేదని తేల్చిచెప్పింది. గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారుడు అమెరికాలోనే ఉండాలా లేదా దేశం విడిచి వెళ్లాలా అనే నిర్ణయం తీసుకునే విచక్షణాధికారం ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఎప్పటి నుంచో ఉందని, ఆ పాత నిబంధనను గుర్తుచేస్తూ కేవలం అంతర్గత మార్గదర్శకాలను మాత్రమే జారీ చేశామని స్పష్టం చేసింది. ఇది అందరికీ వర్తించే కొత్త నిబంధన కాదని, మెజారిటీ దరఖాస్తుదారులు తమ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అయ్యేంత వరకు అమెరికాలోనే సురక్షితంగా కొనసాగవచ్చని డీహెచ్‌ఎస్ ప్రతినిధి వివరించారు.
►ALSO READ | నెలరోజులు AI వాడకానికి రూ.4వేల 750 కోట్లు బిల్లు పంపిన క్లాడ్.. కంపెనీకి దిమ్మతిరిగింది
వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉండిపోవడం, ఇతర ఇమ్మిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన నిర్దిష్ట కేసుల్లో మాత్రమే అధికారులు ఈ విచక్షణాధికారాన్ని ఉపయోగించి దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అయితే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు దేశం విడిచి వెళ్లాల్సి వస్తుందనే దానిపై ప్రభుత్వం ఇంకా పూర్తిస్థాయి స్పష్టమైన నిబంధనలను విడుదల చేయలేదు. వైట్ హౌస్ సీనియర్ అధికారి ఒకరు దీనిని కేవలం ఒక సాధారణ పరిపాలనా ప్రక్రియగా అభివర్ణించారు తప్ప, వలస విధానంలో ఎలాంటి వ్యూహాత్మక మార్పు కాదని స్పష్టం చేశారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులలో అత్యధికులు అమెరికాలోనే ఉంటూ తమ అప్లికేషన్ స్టేటస్‌ను సమీక్షించుకునే వీలుండటంతో లక్షలాది మంది వలసదారులకు పెద్ద ఉపశమనం లభించినట్లయింది.
