చిన్న ఇన్వెస్టర్లకు ఊరట.. టాక్స్ ఫైలింగ్ సులభతరం చేసిన ఆదాయపు పన్ను శాఖ

చిన్న ఇన్వెస్టర్లకు ఊరట.. టాక్స్ ఫైలింగ్ సులభతరం చేసిన ఆదాయపు పన్ను శాఖ

దేశంలోని కోట్ల మంది చిన్న ఇన్వెస్టర్లు, మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ నమోదు ప్రక్రియను సులభతరం చేస్తూ టాక్స్ డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు షేర్ల ద్వారా చాలా తక్కువ లాభం వచ్చినా.. క్లిష్టంగా ఉండే ITR-2 ఫామ్‌ను నింపాల్సి వచ్చేది. కానీ ఇకపై రూ.లక్షా 25వేల వరకు ఉండే లాంట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లాభాలను అత్యంత సులువైన ITR-1 ఫామ్‌లోనే చూపేందుకు వెసులుబాటు కల్పించింది.

ఈ నిర్ణయం వల్ల ప్రధానంగా శాలరీడ్ ఉద్యోగులు, చిన్న చిన్న మొత్తాల్లో SIP పెట్టుబడులు చేసే సామాన్య ఇన్వెస్టర్లకు పెద్ద ఊరట లభించనుంది. గతంలో స్వల్ప లాభాల కోసం కూడా టాక్స్ అడ్వైజర్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఐటీఆర్-1 ద్వారా పన్ను దాఖలు చేయడం వల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా.. ఒత్తిడి కూడా తగ్గుతుంది. అయితే దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. పన్ను చెల్లింపుదారుడి వార్షిక ఆదాయం రూ.50 లక్షల లోపు మాత్రమే ఉండాలి. అలాగే ఆదాయ వనరులు కేవలం జీతం, ఒక ఇల్లు, వడ్డీ వంటి ప్రాథమిక మార్గాల నుంచే ఉండాలి. ఒకవేళ లాభాలు రూ.లక్షా 25వేలు దాటినా లేదా బిజినెస్ నుంచి ఆదాయం ఉన్నట్లయితే ఐటీఆర్-2 లేదా ఐటీఆర్-3 ఫామ్‌లను నింపాల్సి ఉంటుంది.

కేవలం ఫామ్‌ల మార్పు మాత్రమే కాకుండా.. పన్ను రిటర్న్స్ ఫైలింగ్ ప్రక్రియలో మరిన్ని పారదర్శకమైన మార్పులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇకపై పన్ను చెల్లింపుదారులు తమ సమాచారం కోసం రెండు మొబైల్ నంబర్లు, రెండు ఈమెయిల్ ఐడిలు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాల విషయంలో ఆ పార్టీ పేరు, పాన్ వివరాలను తప్పనిసరిగా వెల్లడించాల్సిందే. 

ALSO READ : AIకి ఆత్మ లేదు.. AIని బలిపశువు చేయొద్దు..

ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే ముందు ఇన్వెస్టర్లు కొన్ని ముఖ్యమైన విషయాలను గమనించాలి. తమ ఏఐఎస్ , ఫామ్ 26AS వివరాలను సరిచూసుకోవడం, ఆధార్-మొబైల్ లింకింగ్ పూర్తి చేయడం వంటివి తప్పనిసరి. ప్రస్తుతం న్యూ టాక్స్ రీజిమ్ డిఫాల్ట్‌గా అమల్లో ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. 2026 జూలై 31వ తేదీలోగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ తీసుకున్న ఈ తాజా చర్యల వల్ల ముఖ్యంగా స్టాక్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న యువ ఇన్వెస్టర్లకు ట్యాక్స్ కంప్లయన్స్ అనేది భారం కాకుండా మారనుంది.