- సూర్యాపేటలో జరిగిన మధు హత్య కేసులో వెలుగులోకి..
- పోలీసుల అదుపులో నిందితులు ?
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా యార్కరం గ్రామంలో జరిగిన బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. మధు హత్యకు పాత రాజకీయ కక్షలే కారణమని, అతడు నమ్మిన స్నేహితులే హత్యకు సహకరించినట్లు తేలింది. 2007లో యార్కరం గ్రామంలో జరిగిన మిద్దె రవీందర్ హత్యకు ప్రతీకారంగా అతడి కొడుకు జీవనే ఈ హత్య చేయించినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.
దావత్‌కు పిలిచి..
మధును చంపేందుకు సుమారు ఐదేండ్లుగా ప్లాన్ చేసిన నిందితులు, మద్యంలో మత్తు మందు కలిపి, స్పృహ తప్పి పడిపోయాక దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మర్డర్ కేసులో జీవన్‌తో పాటు జిమ్ ట్రైనర్ ప్రసాద్, చింత సైదులు మరో ఇద్దరు స్నేహితులు పాల్గొన్నట్లు సమాచారం.
మధును హత్య చేసేందుకు నిర్ణయించుకున్న నిందితులు తమ ప్లాన్‌లో భాగంగా.. మధుకు అత్యంత సన్నిహితుడైన చింత సైదులు దావత్ కోసం తాళ్లగడ్డలోని కిరాయి ఇంటికి పిలిపించారు. అక్కడ మద్యంలో మత్తు మందు కలిపి ఇవ్వడంతో కొద్దిసేపటికే మధు స్పృహ కోల్పోయాడు.
తర్వాత సైదులు మరో ముగ్గురికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకొని కత్తితో దారుణంగా నరికి హత్య చేశారు. అనంతరం డెడ్‌బాడీని గోనె సంచిలో మూట కట్టి, ఓ కారును అద్దెకు తీసుకొని యార్కరం గ్రామ శివారులోకి తీసుకెళ్లి డెడ్‌బాడీని పడేశారు.
నిందితులే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి హత్య సమాచారాన్ని అందించినట్లు తెలుస్తోంది. కాగా, మధు హత్య జరిగిన వెంటనే ఇద్దరు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోగా, మిగిలిన ముగ్గురు ఆదివారం లొంగిపోయినట్లు తెలుస్తోంది.
