- ఆయన ఇంటి ముందు కర్రలతో కార్యకర్తల కాపలా
పాట్నా: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) చీఫ్, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవికి దశాబ్దాలుగా కొనసాగిస్తున్న ‘జెడ్ ప్లస్’ కేటగిరీ భద్రతను సామ్రాట్ చౌధరి ప్రభుత్వం శనివారం ఉపసంహరించుకుంది. రాష్ట్రంలో వీఐపీల భద్రతపై నిర్వహించిన తాజా సమీక్ష ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా లాలూ దంపతులు తమకు కేటాయించిన కొత్త భద్రతా సిబ్బందిని వెనక్కి పంపించి వేశారు. పాట్నాలోని ‘10 సర్క్యులర్ రోడ్’ లోని తమ అధికారిక నివాసం వెలుపల మోహరించిన సిబ్బందిని రబ్రీదేవి తిరస్కరించారు. జెడ్ ప్లస్ కేటగిరీని తొలగించిన ప్రభుత్వం బిహార్ స్పెషల్ ఆర్మ్‌డ్ పోలీస్ (బీఎస్‌ఏపీ) విభాగం నుంచి కొద్ది మంది సిబ్బందిని మాత్రమే కేటాయించింది. కొత్త నిబంధనల ప్రకారం.. ఇద్దరి నుంచి ఎనిమిది మంది వరకు హౌస్ గార్డులు, ఇద్దరు బాడీగార్డులతో పాటు ఒక పైలట్ వాహనం మాత్రమే లాలూ దంపతులకు కేటాయించింది.
లాలూ కుటుంబం తీవ్ర ఆగ్రహం
భద్రత తగ్గింపుపై లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. లాలూ కుటుంబానికి హాని చేయాలనే దురుద్దేశంతోనే ప్రభుత్వం భద్రతను తగ్గించిందని ఆరోపించారు. ఆర్జేడీ కార్యకర్తలే తమ కుటుంబానికి కాపలాదారులుగా ఉంటారని చెప్పారు. ఆమె పిలుపుతో వందలాది మంది ఆర్జేడీ కార్యకర్తలు చేతుల్లో కర్రలు, పార్టీ జెండాలు పట్టుకుని లాలూ నివాసం ముందు మోహరించారు.
దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లాలూ కుమారుడు, బిహార్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ సైతం తనకు కేటాయించిన ‘వై’ కేటగిరీ భద్రతను వెనక్కి పంపిస్తూ నిరసన తెలిపారు. లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్‌కు ఉన్న వై కేటగిరీ సెక్యూరిటీని ప్రభుత్వం రద్దు చేసింది.
