
- సినిమా పైరసీలు మొదలు పెట్టి.. కోట్లు దండుకున్న బిహార్ యువకుడు
- కోట్ల రూపాయిలు సంపాదించాడు
- యూట్యూబ్‌లో చూసి క్యూబ్, యూఎఫ్‌వో
- సినిమా ప్రొవైడర్ల సర్వర్లు హ్యాక్
- పలు ప్రభుత్వ వెబ్‌సైట్లు కూడా!
- బిహార్ ఎమ్మెల్యేలు, అధికారులకు సంబంధించిన లాగిన్స్ క్రాక్
- అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇంటర్మీడియెట్చదివిన ఓ బిహార్ యువకుడు క్యూబ్, యూఎఫ్‌వో వంటి మూవీ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీల సర్వర్లను హ్యాక్ చేశాడు. ఎప్పుడూ కంప్యూటర్లో సినిమాలు చూసే ఆ యువకుడు.. కొన్ని రోజుల తర్వాత ప్రతి సినిమాను రిలీజ్‌కు ముందే చూడాలనుకున్నాడు. దీంతో సినిమా థియేటర్ల సర్వర్ల నుంచి మూవీని ఎలా డౌన్లోడ్ చేయాలో యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నాడు. అనంతరం డీబగ్గింగ్, జావా, పైథాన్ వంటి కంప్యూటర్ పరిజ్ఞానంపై పట్టు తెచ్చుకున్నాడు.
అనంతరం క్యూబ్, యూఎఫ్‌వో వంటి మూవీ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీల సర్వర్లను హ్యాక్‌చేసి.. రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న సినిమాను ముందే డౌన్లోడ్ చేసి ఎంజాయ్ చేసేవాడు. అది కేవలం అతని సెల్ఫ్ సాటిసిఫ్యాక్సన్ కోసమే చేసేవాడు. కానీ, తరువాత రోజుల్లో టెలిగ్రామ్ నుంచి బెట్టింగ్‌యాప్ నిర్వహకులు అప్రోచ్ అయ్యారు. మూవీస్ ని డౌన్లోడ్ చేసి.. తాము నిర్వహించే పైరసీ వెబ్సైట్లకు అందించాలని అడిగారు. దీంతో బిహర్ యువకుడు సినిమాలను రిలీజ్ కు ముందే డౌన్లోడ్ చేసి పైరసీ వెబ్సైట్లకు షేర్ చేశాడు.
ఇలా ప్రతి మూవీకి సుమారు రూ.15 వేల నుంచి 50 వేల వరకు వసూల్ చేసేవాడు. ఇలా టెక్నాలజీ ఆధారంగా మూవీ పైరసీకి పాల్పడుతున్న ముఠాను సిటీ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఐదుగురిని అరెస్ట్ చేసి.. మరో ఐదుగురికి నోటీసులు ఇచ్చారు. సీపీ సీవీ ఆనంద్ సోమవారం మధ్యాహ్నం కమాండ్ కంట్రోల్ సెంటర్లో మీడియాకు ఆ వివరాలు వెల్లడించారు.
థియేటర్లలో సీక్రెట్ రికార్డింగ్‌లు, డిజిటల్ సర్వర్ల హ్యాకింగ్..
తెలుగు సినిమాలు పైరసీకి గురవుతున్నాయని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) యాంటీ-వీడియో పైరసీ సెల్ ప్రతినిధి యర్ర మనీంద్రబాబు జూన్ 5న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మే1న విడుదలైన హిట్: ది థర్డ్ కేస్, మే 9న విడుదలైన సింగిల్, కుబేరా వంటి సినిమాలు విడుదలైన మొదటి రోజునే 1TamilBlasters, 5MoviezRulz, 1TamilMV వంటి వెబ్‌సైట్లలో అప్‌లోడ్ అయ్యాయి. వీటిని పరిశీలించిన అనంతరం పోలీసులు టెక్నికల్ పద్ధతుల్లో దర్యాప్తు చేశారు. ఈ ముఠా సభ్యులు థియేటర్లలో సీక్రెట్రికార్డింగ్లు, డిజిటల్ సర్వర్ల హ్యాకింగ్ వంటి పద్ధతులు ఉపయోగించి పలు సినిమాలను పైరసీ చేశారని గుర్తించారు.
యూట్యూబ్‌లో చూసి హ్యాకింగ్..
బిహార్‌కు చెందిన 21 ఏండ్ల అశ్వని కుమార్ యూట్యూబ్‌లో డీబగ్గింగ్ నేర్చుకొని వెబ్‌సైట్లు, డిజిటల్ మీడియా సర్వర్లు (క్యూబ్, యూఎఫ్‌వో వంటివి) హ్యాక్ చేశాడు. హెచ్డీ సినిమాలను లీక్ చేసి, టెలిగ్రామ్ గ్రూపుల్లో (HDmovies, Flimyzap, World4free) 800 డాలర్ల చొప్పున క్రిప్టోలో అమ్మాడు. ప్రభుత్వ సైట్లు కూడా హ్యాక్ చేశాడు. బిహార్‌లోని కొన్ని ప్రభుత్వ వెబ్సైట్ల డేటాబేస్‌ను హ్యాక్ చేశాడు. వాటిలో ముఖ్యంగా బిహార్ అసెంబ్లీ వెబ్‌సైట్ ఉంది. ఆ వెబ్‌సైట్ సర్వర్‌ను హ్యాక్ చేసి, ఎమ్మెల్యేలు, అధికారులకు సంబంధించిన లాగిన్స్‌ను క్రాక్ చేశాడు.
తమిళనాడుకు చెందిన మరో వ్యక్తి సిరిల్ ఇన్ఫంట్ రాజ్ అమలదాస్ 1TamilBlasters.net వెబ్‌సైట్ ను నడుపుతున్నాడు. క్లౌడ్ సర్వర్లు ఉపయోగించి పైరేటెడ్ కంటెంట్ అప్‌లోడ్ చేశాడు. గేమింగ్/బెట్టింగ్ సైట్ల ప్రకటనలకు నెలకు పదివేల డాలర్ల నుంచి 30వల డాలర్ల క్రిప్టో కరెన్సీ సంపాదించాడు. 2020 నుంచి సుమారు 543 సినిమాలు అప్‌లోడ్ చేసి రూ.2 కోట్లు సంపాదించాడు. ఇతను పోలీసులకు దొరకుండా టెక్నికల్ జాగ్రత్తలు తీసుకున్నాడు.
అలాగే ఇతను 1xBet, 4raBet, Rajbet , Parimatch వంటి బెట్టింగ్/గేమింగ్ యాప్‌ల యజమానులను సంప్రదించి, నెలవారీ పేమెంట్‌ను $30,000కి పెంచాలని డిమాండ్ చేశాడు. తమిళనాడుకు చెందిన మరో వ్యక్తి సుధాకరన్ థియేటర్లలో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషలకు చెందిన 35 సినిమాలు రికార్డ్ చేసి అప్‌లోడ్ చేసేవాడు. అతను టెలిగ్రామ్ గ్రూపులలో చేరి క్రిప్టో కరెన్సీ అందుకున్నారు. ఏపీకి చెందిన జాన కిరణ్ కుమార్ హైదరాబాద్ లోని సినీ పోలీస్, మంత్ర మాల్థియేటర్లలో iPhoneతో 100 సినిమాలు రికార్డ్ చేశాడు.
ప్రతి సినిమాకు 300 నుంచి 400 డాలర్లు క్రిప్టోలో తీసుకునేవాడు. బిహార్‌కు చెందిన అర్సలాన్ అహ్మద్ ఫ్రెండ్స్ తో కలిసి థియేటర్లలో రికార్డింగ్ చేసి, SendGB.com ద్వారా లింక్‌లు షేర్ చేశాడు. ప్రతి సినిమాకు 135 డాలర్లు తీసుకునేవాడు. వీరందరిని అరెస్టు చేసిన పోలీసులు సీపీయూ, హార్డ్ డిస్క్‌లు, మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, పెన్ డ్రైవ్‌లు, మెమరీ కార్డులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పైరసీ రెండు రకాలుగా..
సినిమా పైరసీ ప్రధానంగా రెండు మార్గాల్లో జరుగుతోంది. ఒకటి.. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి సినిమా కాపీ లీక్ అవడం. మరొకటి, క్యామ్ రిలీజ్‌లు.. అంటే థియేటర్‌లో సినిమా మొదటి రోజు సీక్రెట్ కెమెరాలు, స్మార్ట్ ఫోన్లలో రికార్డ్ చేసి లీక్ చేయడం. ఈ విధానం వలన థియేటర్లలో ప్రదర్శనలో ఉన్నప్పుడే సినిమాలు పైరసీ అవుతున్నాయని పోలీసులు తెలిపారు.