టర్కీ భూకంపాన్ని ముందే పసిగట్టిన పక్షులు

టర్కీ భూకంపాన్ని ముందే పసిగట్టిన పక్షులు

ప్రకృతి వైపరిత్యాలను మనుషుల కంటే జంతువులు, పక్షులు ముందుగా పసిగడతాయని అనేక సందర్భాల్లో నిరూపితమైంది. గతంలో సునామీ, తుపాన్లను వాతావరణ శాఖ కంటే ముందే పక్షులు, ఇతర జంతువులు గుర్తించాయని శాస్త్రవేత్తలు కూడా నిరూపించారు. తాజాగా టర్కీలో సంభవించిన భారీ భూకంపాన్ని పక్షులు ముందే పసిగట్టాయా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.  అంతేకాదు దీన్ని నిరూపించే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

టర్కీలో భూకంపం రావడానికి ముందు పక్షులు భయాందోళన ఒక్కసారిగా గాల్లోకి ఎగిరాయి. సోమవారం తెల్లవారుజామున భవనాలపై అరుస్తూ చక్కర్లు కొట్టాయి.  భూకంపం రావడానికి కొన్ని నిమిషాల ముందు పక్షులు వింతగా ప్రవర్తించాయి. అయితే జనం మాత్రం పక్షుల సంకేతాన్ని పట్టించుకోలేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర దాన్ని రీట్వీట్ చేశారు.

టర్కీలో వరుస భూప్రకంపనలతో భయానక వాతావరణం నెలకొంది. భూకంపం ధాటికి భారీ భవంతులు పేకమేడల్లా కూలిపోయాయి. ఈ విపత్తు కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. వేలాది  ఇళ్లు  ధ్వంసం అయ్యాయి.భూకంపం ధాటికి టర్కీ, సిరియాలో ఇప్పటి వరకు 5 వేల మందికి పైగా ప్రాణాలు విడిచారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు  టర్కీలో ఇప్పటి వరకు 145 సార్లు భూకంప ప్రకంపనలు వచ్చాయి. ఈ ప్రకంపనలు మరికొన్ని రోజులు లేదా వారాల పాటు కొనసాగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.