- డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్(సెంట్రల్) బిశ్వ భూషణ్ పృష్టి
కోల్‌బెల్ట్, వెలుగు: కార్మికుల మేలు కోసమే కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్‌గా మార్చిందని, వీటిని అమలుచేసేందుకు అధికారులు, కాంట్రాక్టర్లకు తప్పనిసరిగా అవగాహన ఉండాలని డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్(సెంట్రల్) బిశ్వ భూషణ్ పృష్టి అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని సింగరేణి బొగ్గు గనులను ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా మందమర్రి సింగరేణి జీఎం కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. కార్మికుల సంక్షేమం, హక్కులు, భద్రత, వేతన నిర్మాణం, పారదర్శక ఉద్యోగ వ్యవస్థ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్స్‌ను రూపొందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మంచిర్యాల, రామగుండం అసిస్టెంట్ లేబర్ కమిషనర్(సెంట్రల్) ఎం.డి.యూసఫ్, మందమర్రి ఏరియా ఇన్‌చార్జి జీఎం మల్లయ్య, ఎస్‌ఓ టు జీఎం జి.ఎల్.ప్రసాద్, డీజీఎం(పర్సనల్) అశోక్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీరాంపూర్ ఏరియా సందర్శన..
శ్రీరాంపూర్ ఏరియాలోని ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్‌ను డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సందర్శించారు. సీసీసీ గెస్ట్ హౌస్‌లో అధికారులతో సమావేశమయ్యారు. ఉద్యోగుల సంక్షేమంపై అధికారులు తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ ఆయనను శాలువాతో సన్మానించారు. సింగరేణి సంస్థలో ఉత్పత్తి లక్ష్యసాధనలో శ్రీరాంపూర్ ఏరియా భూగర్భ గనులు ముందంజలో ఉన్నాయని జీఎం మునిగంటి శ్రీనివాస్ తెలిపారు. ఆర్కే న్యూటెక్ గని ఇప్పటికే 40 రోజుల ముందుగానే వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోగా, అదే బాటలో ఎస్ఆర్పీ–1 గని కూడా వెళ్తోందన్నారు.
ఎస్టీపీపీలో తనిఖీలు..
జైపూర్: జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్(ఎస్టీపీపీ)ను బిశ్వ భూషణ్ పృష్టి సందర్శించారు. వివిధ కాంట్రాక్టు ఏజెన్సీల రికార్డులను పరిశీలించి కార్మికులకు ప్రతి నెల 7వ తేదీ లోపు వేతనాలు చెల్లించాలని సూచించారు. ప్రతి కార్మికుడికి పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలన్నారు.
