ధాన్యం కొనుగోళ్లలో రూ.4 వేల కోట్ల దోపిడీ..వడ్ల సేకరణపై రేవంత్, ఉత్తమ్‌‌వి పచ్చి అబద్ధాలు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ధాన్యం కొనుగోళ్లలో రూ.4 వేల కోట్ల దోపిడీ..వడ్ల సేకరణపై రేవంత్, ఉత్తమ్‌‌వి పచ్చి అబద్ధాలు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ధాన్యం కొనుగోళ్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భారీ దోపిడీకి పాల్పడుతోందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ‘రైతు గోస- బీజేపీ భరోసా’ యాత్రలో భాగంగా రైతులు పడుతున్న ఇబ్బందులను చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ వసూళ్లు, తరుగు రూపంలో దాదాపు రూ.4 వేల కోట్ల దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లు, లెక్కలపై మంత్రులకు దమ్ము, ధైర్యం ఉంటే ఓపెన్ డిబేట్‌‌కు రావాలని సవాల్‌‌ విసిరారు.

జూన్ 1లోపు కల్లాల్లో ఉన్న ప్రతి గింజను కొనుగోలు చేయాలని, లేదంటే తదుపరి ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. ఐదు రోజులుగా చేవెళ్ల, పరిగి నుంచి ఉత్తర తెలంగాణ వరకు పర్యటించామని, ఎక్కడ చూసినా రోడ్లపై కిలోమీటర్ల మేర ధాన్యం కుప్పలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఐకేపీ సెంటర్లు రైతులకు ఏఎంసీ కేంద్రాలుగా కాకుండా జైళ్లలా కనిపిస్తున్నాయన్నారు.

రాష్ట్రంలో 80 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తున్నారని, ఇప్పటివరకు కేవలం 45 లక్షల టన్నులే సేకరించారన్నారు. ధాన్యం సేకరణలో క్వింటాల్‌‌కు 10 కిలోల వరకు తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారని  ఆరోపించారు. గన్నీ బ్యాగులు, రవాణా కోసం కేంద్రం నిధులిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం రైతులతోనే బలవంతంగా సంచికి రూ.75 నుంచి రూ.80 వసూలు చేయిస్తోందని మండిపడ్డారు.