
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్‌పై సభలో చర్చించాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రుల్లో ఎంతమంది బీసీలకు అవకాశం ఇచ్చిందని ప్రశ్నించారు. అది వాళ్ల చేతుల్లో పనే కదా అని అన్నారు. బీసీలకు మంచి మంత్రి పదవులు ఇవ్వొచ్చు కదా అని నిలదీశారు. ఆదివారం అసెంబ్లీలో మున్సిపాలిటీ చట్ట సవరణ బిల్లుపై పాయల శంకర్ మాట్లాడారు. వాకిటి శ్రీహరికి పెద్ద పోర్ట్ ఫోలియో వస్తుందనుకున్నానన్నారు.
దీనిపై కల్పించుకున్న వాకిటి శ్రీహరి.. పాయల్ శంకర్‌కు కూడా బీజేపీలో ముందుస్థానం దొరుకుతుందని తానూ అనుకున్నానన్నారు. ప్రసంగాన్ని కొనసాగించిన పాయల్ శంకర్.. ఏ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో.. ఏ రెడ్డి ఏం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో సై అంటున్న బీజేపీ.. కేంద్రంలో నై అంటున్నదని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీసీలపై కపట ప్రేమ చూపించొద్దని హితవు చెప్పారు. దీనికి స్పందించిన పాయల్ శంకర్.. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ బిల్లులు ప్రవేశపెట్టగానే చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు అయిపోయినట్టుగా మిత్రులు మిఠాయిలు పంచి పటాకులు పేల్చి సంబురాలు చేసుకున్నారన్నారు.
ఆ సంతోషాన్ని కల్లలు చేసేందుకు బీజేపీ యూటర్న్ తీసుకున్నదని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. బీసీలపై అంత ప్రేమే ఉంటే రిజర్వేషన్ల అంశాన్ని షెడ్యూల్ 9లో చేర్పించేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. బీసీలను ఆశల పల్లకిలో ఊరేగిస్తున్నారని పాయల్ శంకర్ అన్నారు. సీఎంవో, ఇంటెలిజెన్స్, అడ్వకేట్ జనరల్(ఏపీ) వ్యవస్థల్లో బీసీలకు అవకాశం ఇవ్వరా అని ప్రశ్నించారు.