నేడు పటాన్ చెరులో విమోచన సభ

నేడు పటాన్ చెరులో విమోచన సభ
  • హాజరు కానున్న కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ విమోచన దినోత్సవం, ప్రధాని నరేంద్ర మోడీ బర్త్ డే ఒకే రోజు కావడంతో బీజేపీ నేతల్లో సందడి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులపాటు ఊరి నిండా మన జెండా, సేవా సప్తాహ కార్యక్రమాలను  చేపట్టిన బీజేపీ మంగళవారం విమోచన దినోత్సవం సందర్భంగా పటాన్ చెరులో భారీ సభ నిర్వహిస్తోంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, రక్షణ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్,  పార్టీ నేతలు లక్ష్మణ్, విద్యాసాగర్ రావు, మురళీధర్ రావు, వివేక్ వెంకటస్వామి, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, పెద్దరెడ్డి పాల్గొననున్నారు. మొదట బీజేపీ చీఫ్ అమిత్ షాను కేంద్ర హోంమంత్రి హోదాలో తీసుకురావాలని రాష్ట్ర బీజేపీ నేతలు అనుకున్నప్పటికీ ఆయనకు వీలు కాకపోవడంతో జోషి హాజరవుతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పటాన్ చెరులోని ఎస్వీఆర్ గార్డెన్ లో జరిగే సభకు బీజేపీ అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలతో పాటు సంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో  జనాన్ని  తరలించనుంది. పటాన్ చెరు సభ కంటే ముందు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. తర్వాత సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ లో రోగులకు పండ్లు పంపిణీ చేస్తారు. సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ నిర్మాత అశ్వనీదత్, దర్శకుడు నాగ్ అశ్విన్ ల ఇంటికి వెళ్లి వారిని కలువనున్నారు. మరోవైపు  కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి హైదరాబాద్, సికింద్రాబాద్ లలో నిర్వహించనున్న పలు కార్యక్రమాల్లో  పాల్గొంటారు.  ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా  హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అనాథాశ్రమాలు, హాస్టళ్లు, హాస్పిటల్స్ లో  బీజేపీ నాయకులు, కార్యకర్తలు  పండ్లు, వస్త్రాలు పంపిణీ చేయనున్నారు.

అమరవీరులను అవమానిస్తున్నారు: నేతలు

రోశయ్య హయాంలో తెలంగాణ విమోచన వేడుకలను అధికారికంగా జరపాలని డిమాండ్ చేసిన కేసీఆర్..  సీఎం కాగానే మర్చిపోయి అమరవీరులను అవమానపరుస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో తెలంగాణ విమోచన వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన తర్వాత రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు, తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.