న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్, సీబీఎస్ఈ మూల్యంకనంలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ధర్నాపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్ స్పందించారు. రాంచీలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారత యువత దేశ నిర్మాణం, తమ భవిష్యత్తును సురక్షితం చేసుకోవడంపై దృష్టి సారించారని పేర్కొన్నారు.
కానీ కొంతమంది దేశ యువతను ప్రభుత్వ వ్యతిరేకులుగా ముద్ర వేసి ప్రతికూల రాజకీయాల్లోకి లాగాలని చూస్తున్నారని.. అలాంటి వారి చేతుల్లో యువత కీలుబొమ్మలుగా మారరని.. దేశ యువత దిశను ఎవరూ నిర్దేశించలేరని పరోక్షంగా కాక్రోచ్ జనతా పార్టీపై విమర్శలు గుప్పించారు.
విదేశాల్లో కూర్చున్న కొందరు భారతదేశ యువత భవిష్యత్తును తామే నిర్దేశించగలమని అనుకుంటున్నారని అమెరికాలో ఉంటున్న కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కేను పరోక్షంగా విమర్శించారు. కానీ భారతదేశ యువత కొద్దిమంది చేతుల్లో కీలుబొమ్మలుగా మారదని నొక్కి చెప్పారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే ప్రజాస్వామ్య హక్కు ప్రజలకు ఉందని.. అయితే ఆ వ్యతిరేకత ప్రజాస్వామ్య నియమాలకు లోబడి ఉండాలని హితవు పలికారు.
భారత యువతపై ప్రశంసలు:
భారత దేశ యువతపై బీజేపీ చీఫ్ నితీన్ నబిన్ ప్రశంసలు కురిపించారు. భారతదేశ యువతరం ఆవిష్కరణలు, సృజనాత్మకతకు పేరుగాంచిందన్నారు. యువత అంకితభావం, కృషి వల్ల దేశంలో సుమారు రెండు లక్షల స్టార్టప్‌లు పుట్టుకొచ్చాయని.. దేశం గ్లోబల్ ఐటీ హబ్‌గా మారాలని లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. మన పొరుగు దేశాలలో యువత ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాలు, ఆందోళనలు భారత దేశ యువతను ఆకట్టుకోవని అన్నారు. క్రమశిక్షణతో దేశ నిర్మాణానికి పనిచేసే మన దేశ యువత ఎప్పటికీ అటువంటి రాజకీయాలు చేయరన్నారు.
