- దేశంలో గ్యాస్ కొరత లేదు.. కృత్రిమంగా సృష్టించిందే :బీజేపీ చీఫ్ రాంచందర్రావు
- యుద్ధాలు జరుగుతున్నా ధరలు పెరగకుండా చూసిన మోదీ
- మూసీ పేరుతో పేదల ఇండ్లు కూల్చడం ఏంటని ఫైర్
హైదరాబాద్, వెలుగు: దేశంలో గ్యాస్ కొరత లేకపోయినా కాంగ్రెస్ పార్టీ కావాలనే కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ స్టేట్ ఆఫీసులో మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన వందలాది మంది కార్యకర్తలు ఒంటేరు నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా గ్యాస్ డిమాండ్ రోజుకు 55 లక్షల సిలిండర్లు ఉంటే, కాంగ్రెస్ సృష్టించిన భయంతో అది 76 లక్షలకు పెరిగిందన్నారు. మహారాష్ట్రలో యూత్ కాంగ్రెస్ నేతలు వేలాది సిలిండర్లను అక్రమంగా నిల్వ చేస్తూ పట్టుబడటమే దీనికి నిదర్శనమని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఈ సమస్య ఎందుకు వస్తోందని ప్రశ్నించారు.
వియత్నాంలో 50%, పాకిస్థాన్‌లో 20% ధరలు పెరిగినా.. భారత్‌లో మోదీ పైసా భారం పడకుండా చూస్తున్నారని కొనియాడారు. రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్ట్ అంచనాలను రూ.5 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్లకు పెంచారని విమర్శించారు. మూసీలో కలిసే వ్యర్థాలను ఆపడం మానేసి, పేదల ఇండ్లు కూల్చడం ఏంటని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి చేతిలో గడ్డపార పట్టుకుని పేదల ఇండ్లు కూల్చడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లెలగూడలో బీఆర్ఎస్ ఖాళీ అయిందని, ప్రజలు మోదీ వైపు చూస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ఎవరి కోసం కొట్లాడుతుందో అర్థం కావడం లేదన్నారు.
పార్లమెంట్ ఏమైనా పిక్నిక్ స్పాటా?
పార్లమెంటు ఆవరణలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నారని రాంచందర్ రావు మండిపడ్డారు. పార్లమెంట్ ఎంట్రెన్స్ వద్ద కాంగ్రెస్ ఎంపీలు మెట్లపై కూర్చొని టీ తాగుతూ పిక్నిక్ స్పాట్‌లా మార్చడం దురదృష్టకరమన్నారు. సభలో చర్చించే దమ్ము లేక రాహుల్ గాంధీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసు వద్ద ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.
‘సేవ్ తెలంగాణ’ పోస్టర్ ఆవిష్కరణ
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని చేస్తామని రాంచందర్ రావు అన్నారు. రేవంత్ ప్రభుత్వం 99 రోజుల ప్రణాళిక అంటోంది.. కానీ ఈ సర్కార్‌కు ఇంకా 999 రోజులే మిగిలి ఉన్నాయని తెలిపారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ‘ఇగ సహించదు తెలంగాణ.. సేవ్ తెలంగాణ’ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రంలో పరిపాలనా వైఫల్యాలపై నిరంతర పోరాటం సాగిస్తామని చెప్పారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈనెల16న రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో ఎమ్మార్వోలకు వినతిపత్రాలు అందజేస్తామని, 20న అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల ఎదుట భారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, తూళ్ల వీరేందర్ గౌడ్, చింతల రాంచందర్ రెడ్డి, రాజ్ భూపాల్ గౌడ్, అందెల శ్రీరాములు, ఎన్వీ సుభాష్, కార్తీకరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
