కేంద్ర బడ్జెట్​ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ కమిటీలు

కేంద్ర బడ్జెట్​ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ కమిటీలు

హైదరాబాద్, వెలుగు: కేంద్ర బడ్జెట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ రాష్ట్ర స్థాయిలో నలుగురు సభ్యులతో కమిటీని నియమించింది. మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి కన్వీనర్ గా,  సభ్యులుగా పార్టీ రాష్ట్ర నేతలు ప్రకాశ్ రెడ్డి, రజనీ, సంగప్ప ఉన్నారు. వీరు అన్ని జిల్లాల్లో పర్యటించి కేంద్ర బడ్జెట్ తో ఏ వర్గానికి ఎంత మేలు జరగనుంది, తెలంగాణ అభివృద్ధి కోసం ఈ బడ్జెట్ ఏ రకంగా ఉపయోగపడుతుందనే వివరాలను సెమినార్ లు, ప్రెస్ మీట్ల ద్వారా వివరించనున్నారు. త్వరలో జిల్లా స్థాయిలోనూ ముగ్గురు సభ్యులతో బడ్జెట్ యాక్టివిటీ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఆ కమిటీలు మండల స్థాయిలో పర్యటించి ప్రజలకు బడ్జెట్ గురించి వివరించనున్నాయి. 

జాతీయ స్థాయి కమిటీ కూడా..

జాతీయ స్థాయిలో ఇప్పటికే ఏర్పాటు చేసిన కమిటీ కూడా రాష్ట్రంలో రెండు పెద్ద నగరాల్లో పర్యటించి, ప్రెస్ కాన్ఫరెన్స్ లు ఏర్పాటు చేసి బడ్జెట్ పై వివరించనుంది. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన బడ్జెట్ యాక్టివిటీ కమిటీలు  ప్రతి జిల్లా కేంద్రంలో వివిధ వృత్తుల వారితో సమావేశాలు నిర్వహించనున్నాయి. మార్కెట్ కేంద్రాలు, ట్రేడ్ సెంటర్లు, డాక్టర్లు, ప్రభుత్వ పెన్షనర్లు, చార్టర్డ్​ అకౌంటెంట్లు,  లాయర్లు, వ్యాపార సంఘాలు, రైతు నాయకులకు అవగాహన కల్పించనున్నాయి. ఈ నెల  3 నుంచి 10 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నాయి.