
హైదరాబాద్, వెలుగు: బీజేపీకి చెందిన 47 మంది జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల లీడర్లతో ప్రధాని మోడీ మంగళవారం భేటీ కానున్నారు. ఇటీవల మోడీ హైదరాబాద్ వచ్చిన సందర్భంలో బేగంపేట్ ఎయిర్ పోర్టులో సెండాఫ్ ఇచ్చేందుకు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు వచ్చారు. అయితే ఎయిర్పోర్టులో గాలి దుమారం, వర్షం కారణంగా కార్పొరేటర్లతో మోడీ పరిచయ కార్యక్రమం రద్దయింది. వీరిని త్వరలోనే ఢిల్లీకి తీసుకురావాల్సిందిగా అక్కడే ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని మోడీ ఆదేశించారు. దీంతో మంగళవారం సాయంత్రం 4 గంటలకు మోడీని కలిసేందుకు ఢిల్లీకి రావాల్సిందిగా ఆదివారం పీఎంఓ నుంచి ఆహ్వానం అందింది. మోడీతో భేటీ కోసం కార్పొరేటర్లు, నేతలు ఢిల్లీకి చేరుకున్నారు.