తండాలను ప్రభుత్వాలు గాలికి వదిలేశాయ్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు

తండాలను ప్రభుత్వాలు గాలికి వదిలేశాయ్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు
  •     గ్రామ పంచాయతీలు చేసి పైసా ఇయ్యకుండా ఆగం చేసిన్రు: రాంచందర్​రావు 
  •     కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలో గిరిజనులకు ఒరిగిందేమీ లేదని కామెంట్‌

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో తండాల అభివృద్ధిని పాలక ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. ఓట్ల కోసం తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం.. వాటికి నిధులు ఇవ్వకుండా గిరిజనులను ఆగం చేస్తున్నాయని విమర్శించారు. 

ఆదివారం హైదరాబాద్‌‌‌‌లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాంచందర్ రావు.. సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ప్రస్తుతం జరుగుతున్న అరకొర అభివృద్ధి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఐటీడీఏ నిధులతోనే సాధ్యమవుతోందని  స్పష్టం చేశారు. 

దేశంలో గిరిజనుల సంక్షేమం కోసం మోదీ సర్కార్ ప్రత్యేకంగా ట్రైబల్ మినిస్ట్రీ ఏర్పాటు చేసిందన్నారు. ఎస్టీ కమిషన్, గిరిజన సంక్షేమానికి బడ్జెట్‌‌‌‌లో భారీగా నిధులు కేటాయించిందన్నారు. రాష్ట్రంలో సమ్మక్క-సారలమ్మ గిరిజన వర్సిటీ ఏర్పాటుతో గిరిజన బిడ్డలకు ఉన్నత చదువులు అందుబాటులోకి వచ్చాయన్నారు. 

బంజారా ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితం బీజేపీ సిద్ధాంతాలకు అద్దం పడుతుందన్నారు. అందుకే బీజేపీ ఏటా ట్రైబల్ మోర్చా ఆధ్వర్యంలో సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ,  ఎస్టీ మోర్చా అధ్యక్షుడు రవి నాయక్, వేముల అశోక్, కళ్యాణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.