
- భాగ్యలక్ష్మి ఆలయాన్ని ‘గోల్డెన్ టెంపుల్’ గా మారుస్తం: బండి సంజయ్
- కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కి ఘనస్వాగతం
- బేగంపేట నుంచి నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలం ఉన్నామని.. వచ్చే శాసనసభ ఎన్నికల్లో 88 మంది ఎమ్మెల్యేలతో తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగరవేస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రమంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత గురువారం సాయంత్రం రాష్ట్రానికి వచ్చిన కిషన్ రెడ్డికి బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బేగంపేట విమానాశ్రయంలో కేంద్రమంత్రి బండి సంజయ్, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, కిషన్ రెడ్డి భార్య కావ్యరెడ్డి ఇతర నేతలు పుష్పగుచ్చం ఇచ్చి వెల్ కమ్ చెప్పారు. అనంతరం బేగంపేట ఏయిర్ పోర్టు నుంచి నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసు వరకూ ‘‘సెల్యూట్ తెలంగాణ’’ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో బీజేపీ కార్యకర్తలు, ప్రజలకు అభివాదం చేస్తూ వచ్చారు. తర్వాత బీజేపీ స్టేట్ ఆఫీసులో కేంద్రమంత్రులతో పాటు ఎన్నికైన ఎంపీలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త ఎంతో కష్టపడ్డారని చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల తరఫున, విజయం సాధించిన ఎమ్మెల్యేలు, ఎంపీల తరఫున కార్యకర్తలకు శిరస్సు వచ్చి సెల్యూట్ చెప్తున్నట్టు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి, ప్రజలను సంఘటితం చేస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు.
పార్టీకి కార్యకర్తలే పునాది: లక్ష్మణ్
అంతకుముందు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ... కార్యకర్తలే పునాదిగా బీజేపీ ఏర్పడిందని, నమ్మిన సిద్ధాంతం కోసం, జాతీయ భావన కోసం పోరాటాలు చేస్తుందని చెప్పారు. నమ్మిన సిద్ధాంతం కోసం యువమోర్చా ప్రెసిడెంట్ నందరాజ్ గౌడ్ చివరి వరకూ పోరాడి, ఉగ్రవాదుల చేతిలో ప్రాణాల కోల్పోయాడని గుర్తుచేశారు. కిషన్ రెడ్డి తన ప్రస్థానాన్ని పార్టీ ఆఫీసులో ప్రారంభించి.. 40 ఏండ్లుగా సేవలందించి కేంద్రమంత్రి అయ్యారని గుర్తుచేశారు. బండి సంజయ్ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి కార్పొరేటర్ నుంచి కేంద్రమంత్రి అయ్యారని చెప్పారు. 2029 లో తెలంగాణలో అధికారం లక్ష్యంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు, గోడం నగేశ్, ఎమ్మెల్యేలు వెంకటరమణా రెడ్డి, హరీశ్ బాబు, పాయల్ శంకర్, రామారావు పటేల్, పైడి రాకేశ్, ధన్ పాల్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
భాగ్యలక్ష్మి ఆలయాన్ని ‘గోల్డెన్ టెంపుల్’ గా మారుస్తం: బండి సంజయ్
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని ‘గోల్డెన్ టెంపుల్’ గా మారుస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రకటించారు. అమ్మవారి దయవల్లే బీజేపీ తెలంగాణలో ఎనిమిది ఎంపీ సీట్లు గెలిచిందన్నారు. ఈ విషయంలో కార్యకర్తల కష్టం మరువలేనిదన్నారు. కార్యకర్తలతోపాటు బీజేపీపై నమ్మకం ఉంచిన తెలంగాణ ప్రజలందరికీ ఇదే నా సెల్యూట్ అని చెప్పారు. గురువారం రాత్రి పాతబస్తీ భాగ్యలక్ష్మి దేవాలయంలో కేంద్రమంత్రులతో పాటు ఈటల రాజేందర్, రఘునందర్ రావు తదితరులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‘‘అమ్మవారు చాలా పవర్ ఫుల్, అమ్మవారి దయవల్లే ఆనాడు ప్రజాసంగ్రామ యాత్ర విజయవంతమైంది” అని చెప్పారు. బీజేపీని తెలంగాణలో తిరుగులేని శక్తిగా మార్చి, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చేదాకా పోరాడతానని, తనచివరి రక్తపు బొట్టు వరకు పార్టీ కోసమే ధారపోస్తానని తెలిపారు.