కామారెడ్డిలో హైటెన్షన్... కాంగ్రెస్ నేత కారుకు నిప్పు.. బీజేపీ కార్యకర్తల విధ్వంసం..

కామారెడ్డిలో హైటెన్షన్... కాంగ్రెస్ నేత కారుకు నిప్పు.. బీజేపీ కార్యకర్తల విధ్వంసం..

కామారెడ్డిలో హైటెన్షన్ నెలకొంది. అరోరా కాలేజీ భూములు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూములు శిశు మందిర్ విషయంలో కాంగ్రెస్ బీజేపీ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్న క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. శనివారం ( ఫిబ్రవరి 21 ) బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి క్యాంపు ఆఫీసు దగ్గరికి చేరుకున్న కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి ఇతర నేతల కార్లను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు బీజేపీ కార్యకర్తలు. అక్కడితో ఆగకుండా.. కారుకు నిప్పు పెట్టి హల్చల్ చేశారు.

పరిస్థితి అదుపు తప్పడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను ఘటనాస్థలం నుంచి చెదరగొట్టారు. మంటలు ఆర్పీ కారును అక్కడి  నుంచి తరలించారు పోలీసులు. బీజేపీ కార్యకర్తల అత్యుత్సాహం కామారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. 

శిశు మందిర్ వేదికగా చర్చకు రెండు పార్టీలు సిద్ధం కావడంతో కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నాయకులు సాక్ష్యాధారాలతో చర్చకు రావాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఛాలెంజ్ విసిరారు. అయితే.. కాంగ్రెస్, బీజేపీ నేతల బహిరంగ చర్చకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.

కామారెడ్డి డిగ్రీ కాలేజీ భూములకు సంబంధించి తనపై కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు తీసుకొని శనివారం ఉదయం 10 గంటలకు స్థానిక శిశు మందిర్ వద్దకు రావాలని, తాను స్వయంగా వస్తానని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకులు, కాలేజీ భూముల నుంచి స్థలాలు పొందిన సంస్థల ప్రతినిధులు, అధికారులు వస్తారన్నారు. నిజానిజాలు నిర్ధారణ చేసుకునేందుకు సాక్ష్యాలతో రావాలని కోరారు.

డిగ్రీ కాలేజీ భూముల వ్యవహారంలో తనపై చేసిన ఆరోపణలకు చర్చకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. తాము కూడా వస్తామని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత కామారెడ్డిలో పార్టీల మధ్య విమర్శల వేడి రాజుకుంది. కాంగ్రెస్, బీజేపీనాయకులు విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు విసురుకున్నారు.