దేశంలో అత్యధికంగా విరాళాలు అందుకున్న రాజకీయ పార్టీగా బీజేపీ

దేశంలో అత్యధికంగా విరాళాలు అందుకున్న రాజకీయ పార్టీగా బీజేపీ
  • ఇందులో రూ.336.50  కోట్లు ‘ప్రుడెంట్​ఎలక్టోరల్​ ట్రస్ట్’ నుంచే
  • కాంగ్రెస్​కు రూ.95.46 కోట్ల డొనేషన్లు 
  • 2021‌‌-22లో రాజకీయ పార్టీలకు అందిన విరాళాలపై ఏడీఆర్​ రిపోర్ట్​

న్యూఢిల్లీ : దేశంలో అత్యధికంగా విరాళాలు అందుకున్న రాజకీయ పార్టీగా బీజేపీ నిలిచింది. 2021‌‌–22 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ మొత్తం 4,957 మంది దాతల ద్వారా రూ.614 కోట్ల విరాళాలు పొందింది. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ 1,255 మంది దాతల ద్వారా రూ.95.46 కోట్ల డొనేషన్లు పొందింది. అసోసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్​ రిఫార్మ్స్​ (ఏడీఆర్) విడుదల చేసిన తాజా నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్​, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీలకు కలిపి వచ్చిన దాని కంటే మూడు రెట్లు ఎక్కువగా బీజేపీకి డొనేషన్స్​ వచ్చాయి.  2021-–22 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని రాజకీయ పార్టీలకు మొత్తం 7,141 మంది దాతల నుంచి రూ.780.77 కోట్ల విరాళాలు సమకూరాయి. దాతల నుంచి రూ.20వేలకు మించిన విరాళాలను తాము స్వీకరించలేదని బహుజన్​ సమాజ్​ పార్టీ (బీఎస్పీ)  స్పష్టంచేసింది.  2020–21 ఆర్థిక సంవత్సరంలో  బీజేపీకి రూ.477.55 కోట్ల డొనేషన్లు రాగా.. 2021‌‌–22లో ఇవి  28.71 శాతం పెరిగి రూ.614 కోట్లకు చేరాయి.  కాంగ్రెస్​ డొనేషన్లు కూడా రూ.74.52 కోట్ల నుంచి రూ.95.46 కోట్లకు పెరిగాయి. 

 రాజకీయ పార్టీలకు అందిన డొనేషన్లలో రూ.395.85 కోట్లు ఢిల్లీ నుంచి, రూ.105.35 కోట్లు మహారాష్ట్ర నుంచి, రూ.44.96 కోట్లు గుజరాత్​ నుంచి వచ్చాయి. ఏ రాష్ట్రం పేరు గానీ, కేంద్రపాలిత ప్రాంతం పేరు గానీ లేకుండా రూ.12.26  కోట్ల విరాళాలు వచ్చాయి. రాజకీయ పార్టీలకు డొనేషన్లు ఇచ్చిన మొత్తం 7,141 మంది దాతల్లో 4,506 మంది వ్యక్తులు కాగా, మరో 2,551 మంది కార్పొరేట్, వ్యాపార రంగాలకు చెందినవారు ఉన్నారు.  బీజేపీకి  2,068 కార్పొరేట్​, వ్యాపార సంస్థల నుంచి  రూ.548.81 కోట్ల డొనేషన్లు వచ్చాయి. ఇందులోనూ అత్యధికంగా రూ.336.50  కోట్ల డొనేషన్​ను ‘ప్రుడెంట్​ఎలక్టోరల్​ ట్రస్ట్’ ఒక్కటే బీజేపీకి ఇవ్వడం గమనార్హం. ఈ ట్రస్ట్​ కాంగ్రెస్​పార్టీకి రూ.16.50 కోట్ల విరాళం ఇచ్చింది. రాజకీయ పార్టీలకు భారీగా డొనేషన్స్​ ఇచ్చిన ట్రస్ట్​ ఇదే.