ఈస్ట్, సౌత్​లో బీజేపీకే ఎక్కువ సీట్లు : అమిత్ షా 

ఈస్ట్, సౌత్​లో బీజేపీకే ఎక్కువ సీట్లు : అమిత్ షా 
  •     ఈసారి ఎన్డీయేకు 400 స్థానాలు పక్కా 
  •     తెలంగాణలో 10 సీట్లు.. ఏపీలో కూటమిదే విజయమని ధీమా 

న్యూఢిల్లీ/మహారాజ్ గంజ్/దేవరియా : ఈసారి ఎన్డీయేకు 400 సీట్లు పక్కాగా వస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. అటు సౌత్ ఇండియాలో, ఇటు ఈస్ట్ ఇండియాలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని చెప్పారు. ఎన్డీటీవీకి అమిత్ షా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు. ‘‘తూర్పు రాష్ట్రాలైన బెంగాల్, జార్ఖండ్, బిహార్, ఒడిశాలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది.

అలాగే కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడులోనూ బీజేపీకే ఎక్కువ సీట్లు వస్తాయి” అని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ‘‘బెంగాల్​లో మాకు మంచి మెజారిటీ వస్తుంది. అక్కడ 42 స్థానాలకు గాను 24–30 సీట్లు గెలుచుకుంటం. ఒడిశాలో 21 లోక్ సభ స్థానాలకు గాను 17 గెలవాలని టార్గెట్ పెట్టుకున్నం. ఇక ఇదే రాష్ట్రంలోని 147 అసెంబ్లీ సీట్లకు గాను 75 స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నం.

తెలంగాణలో 17 లోక్ సభ సీట్లు ఉండగా, అక్కడ 10 స్థానాల్లో విజయం సాధిస్తాం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మా కూటమే గెలుస్తుంది. అలాగే అక్కడ ఎక్కువ ఎంపీ సీట్లనూ గెలుచుకుంటం” అని తెలిపారు. ‘ఈసారి 400కు పైగా’ నినాదం నిజమవుతుందా? అని ప్రశ్నించగా.. ‘‘మేం 2014లో మోదీ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లినప్పుడు స్పష్టమైన మెజారిటీతో గెలుస్తామని చెప్పాం. చాలామంది అసాధ్యం అన్నారు.

 కానీ మేం స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చాం. ఆ తర్వాత 2019 ఎన్నికల టైమ్​లో మేం ‘300 ప్లస్’ నినాదం ఇచ్చాం. అప్పుడు కూడా సాధ్యం కాదని చాలామంది అన్నారు కానీ మేం సాధించాం. ఈసారి ‘400 ప్లస్’ నినాదంతో ముందుకెళ్తున్నాం. ఇప్పుడు కూడా సాధ్యం కాదంటున్నారు. కానీ మేం సాధించుకుంటాం” అని చెప్పారు.  

రాహుల్​కు 40 సీట్లు కూడా రావు.. 

ఇండియా కూటమికి ఓటమి తప్పదని అమిత్ షా అన్నారు. బుధవారం యూపీలోని మహారాజ్ గంజ్, దేవరియా నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటమి తప్పదని గ్రహించిన కూటమి నేతలు.. అందుకు ఈవీఎంలే కారణమని చెప్పాలని నిర్ణయించుకున్నారని ఎద్దేవా చేశారు. ‘‘జూన్ 4న మధ్యాహ్నం ఇద్దరు రాకుమారులు (రాహుల్, అఖిలేశ్ యాదవ్) ప్రెస్ మీట్ పెట్టి.. ‘ఈవీఎంల వల్లే మేం ఓడిపోయాం’ అని చెబుతారు. మోదీకి 5 రౌండ్లలో 310 సీట్లు దాటుతాయి. రాహుల్ బాబాకు 40 సీట్లు కూడా రావు. ఇక మరో రాకుమారుడు (అఖిలేశ్ యాదవ్) నాలుగు సీట్లే గెలుచుకుంటడు” అని షా జోస్యం చెప్పారు.