
- ప్రకాశ్ జవదేకర్, సునీల్ బన్సల్‌కు హైకమాండ్ స్పెషల్ టాస్క్
- 27న ఖమ్మం అమిత్ షా సభలో భారీ చేరికలకు ప్లాన్
- రెడ్డి, కమ్మ సామాజిక వర్గం మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులపైనే ఫోకస్
- ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల నేతలే టార్గెట్
- బీఆర్ఎస్ అసంతృప్తులతోనూ కొనసాగుతున్న సంప్రదింపులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో 4 నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో బీజేపీ చేరికలను స్పీడప్ చేసింది. దీనికి సంబంధించిన టాస్క్‌ను రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్చార్జ్ ప్రకాశ్ జవదేకర్, సహ ఇన్చార్జ్ సునీల్ బన్సల్‌కు హైకమాండ్ అప్పగించింది. బీఆర్ఎస్ తన అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంతో ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు, కాంగ్రెస్‌లోని అసంతృప్తులపై బీజేపీ దృష్టి సారించింది. ఇప్పటికే ఈ రెండు పార్టీలకు చెందిన నేతలతో బీజేపీ నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారు.
ఈ నెల 27న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖమ్మం సభలో పాల్గొనేందుకు వస్తుండడంతో ఆ సభా వేదికపైనే భారీ చేరికలకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ‘మా పార్టీలో ఎవరు చేరుతారనేది అమిత్ షా సభను చూస్తే తెలుస్తుంది’ అని ఇప్పటికే జవదేకర్ మీడియాకు చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఖమ్మం సభలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని, జాయినయ్యే వారు కూడా రాజకీయాల్లో పెద్ద తలలే అనే సంకేతాలను పార్టీ నేతలు ఇస్తున్నారు.
బలమైన సామాజిక వర్గంపై నేతలపై దృష్టి
ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలకు చెందిన బలమైన సామాజిక వర్గం రెడ్డి, కమ్మ నేతలనే బీజేపీ నాయకులు టార్గెట్ గా చేసుకున్నారు. ఇందులో పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపే ఇతర పార్టీల నేతల విషయం గతంలో లీక్ అయ్యేది. దీంతో ప్రత్యర్థి పార్టీ అలెర్ట్ అయి వాటిని అడ్డుకోగలిగిందని, అప్పుడు బీజేపీలోని కొందరు నేతలు కావాలనే ఈ లీకులు చేసి పార్టీలోకి వచ్చే వారిని రాకుండా అడ్డుపడ్డారనేది కమల దళంలోని ఓ వర్గం నేతల ఆరోపణ. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చేరికల విషయంలో పార్టీ ముఖ్య నేతలు చాలా సీక్రెట్ ను పాటిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో చేరే వారి విషయాన్ని మూడో కంటికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మంచి అవకాశం ఇస్తమని భరోసా
బీజేపీలో చేరే వారితో ప్రకాశ్ జవదేకర్, సునీల్ బన్సల్ లు నేరుగా సంప్రదింపులు జరుపుతూ.. హైకమాండ్ తరపున వారికి పార్టీలో సముచితమైన స్థానం ఉంటుందని భరోసా కల్పిస్తున్నారు. నియోజకవర్గంలో బలమైన అభ్యర్థి లేనిచోట చేరాలనుకునే వారికి టికెట్ హామీ ఇస్తున్నారు. ఒకవేళ బలమైన అభ్యర్థి ఉంటే.. చేరే వారికి ప్రత్యామ్నాయ పదవిపై హామీ ఇస్తున్నారు. నేరుగా జవదేకర్, బన్సల్ రంగంలోకి దిగడంతో చేరాలనుకునే వారు కూడా గతంలో లాగా అనుమానం వ్యక్తం చేయకుండా కాషాయ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో అమిత్ షా ఖమ్మం సభతో జవదేకర్, బన్సల్ ల చేరికల ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయనేది తేలిపోనుంది.
సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లోనే లిస్టు
బీఆర్ఎస్ మొదటి లిస్టు రిలీజ్‌తో ఇప్పుడు అందరి దృష్టి బీజేపీపైనే పడింది. తెలంగాణతో పాటు ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ తన అభ్యర్థుల ఫస్ట్ లిస్టును ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కూడా బీజేపీ లిస్టు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కానీ ఇప్పట్లో ఉండదని, వచ్చే నెల ఫస్ట్ వీక్‌లోనే జాబితా విడుదల కానుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గాల్లో ఒకరికిమించి అంతగా పోటీ లేని స్థానాలతో రాష్ట్ర పార్టీ ఒక జాబితాను సిద్ధం చేసింది. అందులో 20 నుంచి 30 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, పార్టీలో కీలక నేతలు పోటీ చేయాలనుకున్న స్థానాలు ఉన్నాయి. ఇలాంటి చోట్ల సొంత పార్టీ నేతల నుంచి టికెట్ల పోటీ ఉండదు. ఇలాంటి స్థానాలకు సంబంధించిన లిస్టును ఏ క్షణమైనా రిలీజ్ చేయవచ్చని పార్టీలోని కొందరు భావిస్తున్నారు.
ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేల రిపోర్టే కీలకం
ఇతర రాష్ట్రాలకు చెందిన 119 మంది బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో వారం పాటు మకాం వేశారు. ఈ నెల 20న వారు నియోజకవర్గాలకు వెళ్లారు. 27 వరకు అక్కడే ఉంటూ పార్టీ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. బలమైన నేతలు ఎవరున్నారని ఆరా తీస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు ఎలాంటి ప్రయత్నాలు చేయాలనే దానిపై పార్టీ బూత్ స్థాయి కార్యకర్తలను, న్యూట్రల్ గా ఉండే వారిని కలుస్తున్నారు. ఈ నెల 27 తర్వాత ఒక్కో నియోజకవర్గంపై హైకమాండ్‌కు నివేదిక అందిస్తారు. ఈ నివేదికను పరిశీలించి, ఎవరికి టికెట్ ఇవ్వాలనేది హైకమాండ్ ఓ అంచనాకు రావాలంటే కనీసం వారం, పది రోజుల టైమ్ పడుతుంది.