
- 2023లోనూ జూబ్లీహిల్స్ నుంచి పోటీచేసి ఓడిపోయిన దీపక్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం బుధవారం ప్రకటించింది. దీంతో వారం రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లయింది. ఈ స్థానంలో బీసీ అభ్యర్థిని నిలబెట్టాలంటూ బీజేపీలో పెద్ద ఎత్తున చర్చ, హడావుడి నడిచినా.. చివరికి పాత అభ్యర్థి దీపక్ రెడ్డికే టికెట్ ఖరారు చేశారు. జూబ్లీహిల్స్ టికెట్ రేసులో దీపక్ రెడ్డి, కీర్తీరెడ్డి, వీరపనేని పద్మ పేర్లను అధిష్టానానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పంపించారు.
మరోవైపు బీసీ అభ్యర్థిని ప్రకటిస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ, చివరికి లంకల దీపక్‌రెడ్డి అభ్యర్థిత్వం వైపు అధిష్టానం మెుగ్గుచూపింది. ప్రస్తుతం ఆయన బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ప్రెసిడెంట్‌గా ఆయన కొనసాగుతున్నారు. దీపక్ రెడ్డి 2023లోనూ బీజేపీ అభ్యర్థిగా జూబ్లీహిల్స్ లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయనకు 25,866 ఓట్లు రాగా.. మూడోస్థానంలో నిలిచారు. అభ్యర్థి ఎంపికలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిదే తుది నిర్ణయమని, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉందని, దీపక్ రెడ్డి వైపే కిషన్‌రెడ్డి మొగ్గుచూపారని పార్టీ నేతలు చెప్తున్నారు.
వారిద్దరికీ పరీక్షే..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీలో ఇద్దరు లీడర్లకు కొత్త పరీక్షను పెడ్తున్నది. ఈ ఎన్నిక జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు జరగుతుండటంతో దిన్నీ బీజేపీ సహా అన్ని పార్టీలు సీరియస్‌గా తీసుకున్నాయి. అయితే.. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ నియోజకవర్గం సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో ఉండటంలో అక్కడి ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కీలకంగా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాంచందర్‌రావుకు ఇది మొదటి ఎన్నిక. దీంతో ఆయన నాయకత్వానికి కూడా ఇది పరీక్షగా మారిందని పార్టీ నేతలు చెప్తున్నారు.
బీజేపీ అభ్యర్థి వివరాలు
పేరు: లంకల దీపక్ రెడ్డి
తల్లిదండ్రులు: లంకల చంద్రకళ, కృష్ణారెడ్డి (ఎక్స్ సర్వీస్ మెన్)
భార్య: హరితరెడ్డి
పిల్లలు: ఆరుశ్ రెడ్డి, ఆశ్రితరెడ్డి
పుట్టినతేదీ: 21.08.1974
రాజకీయ నేపథ్యం: తెలుగు యువత సిటీ ప్రెసి డెంట్, టీడీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ, బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటీవ్ మెంబర్‌గా పనిచేశారు. ప్రస్తుతం: బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.