వీక్ గా ఉన్న స్థానాలకే ఫస్ట్ లిస్ట్..ఎంపీ సీట్లకు అభ్యర్థులపై బీజేపీ హైకమాండ్ కసరత్తు

వీక్ గా ఉన్న స్థానాలకే ఫస్ట్ లిస్ట్..ఎంపీ సీట్లకు అభ్యర్థులపై బీజేపీ హైకమాండ్ కసరత్తు
  • చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ ఫార్ములాపై ఫోకస్  
  • ఈ నెలఖారులో దేశవ్యాప్తంగా 160 మందితో ఫస్ట్ లిస్ట్ 
  • రాష్ట్రంలో 8 సీట్లకు అభ్యర్థులను  ప్రకటించే చాన్స్   

హైదరాబాద్, వెలుగు:   వచ్చే లోక్ సభ ఎన్నికలకు అభ్యర్థుల ఖరారుపై బీజేపీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఇటీవల చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల్లో అమలుచేసిన ఫార్ములానే పార్లమెంట్ ఎన్నికలకూ ఫాలో కావాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ ఫార్ములా ప్రకారం.. బీజేపీ బాగా బలహీనంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించి, ముందుగా వాటికే అభ్యర్థులను ప్రకటించనున్నారు. దీనివల్ల ఎన్నికల సమయానికి అక్కడ పార్టీ బలపడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఫార్ములా సక్సెస్ కావడంతో ఇదే ఫార్ములా పార్లమెంట్ ఎన్నికల్లోనూ కలిసి వస్తుందని, ప్రధానిగా మోదీ హ్యాట్రిక్ విజయం సాధించేందుకు వీలవుతుందని పార్టీ హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 160 లోక్ సభ సీట్లలో బీజేపీ బాగా బలహీనంగా ఉన్నట్లు పార్టీ హైకమాండ్ గుర్తించింది. ఈ సీట్లలో బరిలోకి దింపాల్సిన అభ్యర్థులపై కసరత్తు షురూ చేసింది.

త్వరలోనే అభ్యర్థుల ఎంపికపై క్లారిటీ వస్తుందని, ఈ నెలాఖరున ఫస్ట్ లిస్టు విడుదల కానుందని రాష్ట్రానికి చెందిన బీజేపీ జాతీయ నేత ఒకరు వెల్లడించారు. ఫార్ములాలో భాగంగా ఫస్ట్ లిస్టులో తెలంగాణలోని 8 సీట్లకూ అభ్యర్థులను ప్రకటించే చాన్స్ ఉందని పార్టీలో చర్చ సాగుతోంది. రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు ఉండగా.. వీటిలో ఖమ్మం, నల్గొండ, వరంగల్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, మహబూబాబాద్, హైదరాబాద్, భువనగిరి స్థానాల్లో బీజేపీ వీక్ గా ఉన్నట్లు అంచనాకు వచ్చారు. ఇక రాష్ట్రంలో బీజేపీకి 4 సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి. ఇవి పోను మరో ఐదు నియోజకవర్గాలపైనా పార్టీ భారీగా ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. వీటిలో మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబ్ నగర్, మెదక్, జహీరాబాద్ నియోజకవర్గాలు ఉన్నాయి.    

టార్గెట్ పది సీట్లు.. 

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో 35 శాతం ఓట్లు, 10 సీట్లు గెలుచుకోవాలని బీజేపీ టార్గెట్ పెట్టుకున్నది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ లో ఇటీవల నిర్వహించిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఇదే విషయాన్ని స్పష్టంచేశారు. రాష్ట్రంలో వీక్ గా ఉన్న 8 ఎంపీ స్థానాల పరిధిలో ఒక్క గోషామహల్ (హైదరాబాద్)లో తప్ప మిగతా అన్ని చోట్లా పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ 8 నియోజకవర్గాలపై బీజేపీ ఢిల్లీ పెద్దలు ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.